ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు పంచుతున్న ఇళ్ల స్థలాల విషయంలో ప్రతిపక్ష పార్టీల రాద్ధాంతం మరీ అతిగా ఉంది. విమర్శించడానికి ఏదో ఒకటి ఉండాలనే అక్కసుతో ఇష్టానుసారం మాట్లాడటం ఏపీలో అలవాటుగా మారింది.
ప్రభుత్వం చేసే పనుల్లో తప్పొప్పులను ఎంచడం ప్రతిపక్షం పని. అలాంటి పని సవ్యంగా చేస్తే మంచిదే. అయితే ఏపీలో ప్రతిపక్ష పార్టీలు మాత్రం పర్వర్టెడ్ గా మారిపోయినట్టుగా ఉన్నాయి.
తెలుగుదేశం నేతలు, పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులు.. ఎలా ఎవరికి వారు తమ వ్యక్తిగత కక్షలను పెట్టుకుని మాట్లాడినట్టుగా కనిపిస్తారు కానీ, ఎక్కడా సద్విమర్శలు వినిపించవు వీరి నుంచి.
అందుకు ఉదాహరణల్లో ఒకటి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ఇళ్ల స్థలాల విస్తీర్ణం గురించి విమర్శించడం. తమ హయాంలో ఎన్ని ఇళ్లపట్టాలు ఇచ్చారో చెప్పలేని లోకేష్ బాబు.. పేదలకు ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు చిన్నవని అంటున్నారు. ఆ మాట అయినా సవ్యంగా కూశారా అంటే అది కూడా లేదు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను బాత్రూమ్ లతో పోల్చారు లోకేష్. అది ఆయన ఇంగితం.
ఒక మాజీ మంత్రి, పెద్దల సభలో సభ్యుడు మాట్లాడాల్సిన మాటలా అవి? అసలు లోకేష్ కు ఈ సెంట్లు, గజాల లెక్కలు తెలిసి ఉండవు. లేక ఆయన తన ఇంటి బాత్రూమ్ విస్తీర్ణాన్ని బట్టి ఏమైనా మాట్లాడారో! ఆయన అంటే చంద్రబాబు తనయుడు కాబట్టి.. సెంటు భూమిలో బాత్రూమే కట్టుకోగలరు.
రెండెకరాల ఆసాములు ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మల మనవడుగా భారీ గిఫ్ట్ లు అందుకున్న నారా లోకేషుడు సెంట్ల కొద్దీ భూముల్లో బాత్రూమ్ లు, లెట్రిన్ రూమ్ లు కట్టుకోగలరు.
కానీ లోకేష్ గ్రహించాల్సిన అంశం ఏమిటంటే.. మన దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో నగర, పట్టణ ప్రాంతాల్లో నూటికి కనీసం 70 శాతం ఇళ్లు సెంటు విస్తీర్ణం లోపే ఉంటాయి. లే ఔట్లు వేసే వాళ్లు.. గత కొన్ని దశాబ్దాల్లో రెండు సెంట్లు, రెండున్నర, 2.75 సెంట్లలో ప్లాట్లు వేస్తుంటారు.
వాటిని కొనే శక్తి ఉన్న వాళ్లు కూడా ఆ మొత్తం విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకోరు. సగం స్థలంలో ఇళ్లు కట్టి, మిగతా స్థలాన్ని ఇంటి ముందో, వెనుకో వదులుకునే వారే ఎక్కువ. ఈ లెక్కన చాలా మంది ఉండేది సెంటు, 1.25 సెంట్ల ఇళ్లలోనే. ఇక అద్దె ఇళ్లలో ఉండే వారి పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. అసలు అద్దెకు ఇళ్లు ఇచ్చే ఉద్దేశంతో వాటి నిర్మాణం చేపట్టే వాళ్లే.. చాలా పరిమిత విస్తీర్ణంతో వాటిని నిర్మిస్తారు.
అద్దెకు ఇచ్చే ఇళ్లలో సెంటు విస్తీర్ణం కన్నా తక్కువ స్థాయిలోనే ఉన్న వాటి సంఖ్య ఏ డెబ్బై శాతం స్థాయిలోనో ఉంటుంది. ఐదు సెంట్ల స్థలం ఉందంటే దాంట్లో అరడజనుకు పైగా ఇళ్లను కట్టేసి రెంటు ఇచ్చే తత్వమే మన పట్టణాల్లో ఉంటుంది.
నగరాలు, పట్టణాలు, ఓ మోస్తరు మండలాలకు వెళ్లినా ఇదే పరిస్థితి. అలాంటి ఇళ్లలోనే భారతీయులు జీవితాలను వెల్లదీస్తూ ఉన్నారు. ఇక ఇంతకు మించిన విస్తీర్ణంలో ఇళ్లను కలిగిన వారు శ్రీమంతుల కిందే లెక్క.
నిజంగానే ఐదారు సెంట్ల స్థలం ఉన్నవారు కూడా అందులో సగంలోనే ఇంటిని కట్టేసుకుంటారు. అంతే కానీ.. లోకేష్ చెప్పినట్టుగా సెంటు భూమిలో బాత్రూమ్ కట్టుకునే పనికిమాలిన వాడు ఎవడూ ఉండడు. అలా కట్టే ఆలోచన అయితే వందల కోటీశ్వరుడికి రావాలి, అది వాళ్ల శక్తి. అలా కాక సెంటు విస్తీర్ణంలో బాత్రూమ్ కట్టే ఆలోచన అమ్మణ్ణమ్మ మనవడు నారా లోకేష్ కే ఉండాలి.
ఇక చికెన్ నారాయణ గారు.. కుక్కలు కట్టేసే స్థలంతో పోల్చారు. ఎంత కండకావరం ఉంటే.. పేదలు కళ్లకు అద్దుకుని తీసుకుంటున్న.. స్థలాలను ఈ చికెన్ నారాయణ కుక్కలు కట్టేసే ప్లేస్ తో పోలుస్తారో! గతంలో ఈ చికెన్ నారాయణ గారు ఖాళీ స్థలాలు కనిపిస్తే ఎర్రజెండాలు పాతే వారు. వాటిని పేదలకు పంచాలనే వారు. ఇప్పుడు ప్రభుత్వం అదే పని చేస్తుంటే.. ఈ మాటలా మాట్లాడాల్సింది?
చంద్రబాబు తనయుడు లోకేష్ కావొచ్చు, చికెన్ నారాయణ కావొచ్చు..ఇలాంటి విమర్శలు చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టుగా అనుకుంటున్నారేమో కానీ, జనం మధ్యకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడితే.. చింతబరికెలు అందుకుంటారు సామాన్యులే.
సెంటు స్థలంలో ఇళ్లు కడితే అది మురికివాడ అవుతుందా? అంటే ఈ లెక్కన ఏపీ, ఇండియా అంతా మురికివాడే. తమకు అధికారం ఉన్నప్పుడు ఏదీ చేయకుండా, ఏం చేతగాక, చేసే మనసు లేక, ఇప్పుడు నోటికి ఏది వస్తే అది మాట్లాడి లోకేష్ తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధిని గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు.