బ్యూటిఫుల్ గా విచారణ చేస్తున్నారన్న నవదీప్

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-29గా ఉన్న నవదీప్ ను కోర్టు అనుమతితో ఈరోజు నార్కోటిక్ బ్యూరో పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో.. దాదాపు 80శాతం ప్రశ్నలకు…

మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఏ-29గా ఉన్న నవదీప్ ను కోర్టు అనుమతితో ఈరోజు నార్కోటిక్ బ్యూరో పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో.. దాదాపు 80శాతం ప్రశ్నలకు నవదీప్ సమాధానాలిచ్చాడని, మరో 20శాతం ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది.

ఉదయాన్నే నీట్ గా షేవ్ చేసుకొని, నార్కోటిక్ బ్యూరో కార్యాలయానికి వెళ్లాడు నవదీప్. నర్సింగరావు, సునీతారెడ్డి నేతృత్వంలో పోలీసుల బృందం దాదాపు 6 గంటల పాటు నవదీప్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. మధ్యలో 3సార్లు అతడికి విరామం ఇచ్చారు. 7-8 ఏళ్ల కిందటి విషయాల నుంచి మొదలుపెట్టి, మూలాల నుంచి ప్రశ్నలు కురిపించినట్టు విచారణ అనంతరం నవదీప్ వెల్లడించాడు.

“బ్యూటిఫుల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 7-8 ఏళ్ల కిందటి ఫోన్ కాల్స్ ను కూడా తీసుకొని, మూలాల్లోకి వెళ్లి విచారణ చేస్తున్నారు. ఇంతకుముందు సిట్, ఈడీలో కూడా నా పేరు ప్రస్తావనకు వచ్చింది. వాటికి సంబంధించి కూడా ప్రతి లింక్ గురించి నన్ను అడిగారు. గతంలోనే నేను అన్ని సమాధానాలు చెప్పాను. ఈసారి కూడా మరో లింక్ రావడంతో మళ్లీ పిలిచారు. ఈసారి కూడా మళ్లీ సమాధానాలు చెప్పాను.”

మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షిగా మారిన రామ్ చందర్ పై కూడా స్పందించాడు నవదీప్. తనకు హైదరాబాద్ లో 10వేల మంది తెలుసని, రామ్ చందర్ అందులో ఒకడని అన్నాడు. అధికారులు మళ్లీ తనను ఎప్పుడు విచారణకు పిలుస్తారనే విషయం తనకు తెలియదన్నాడు. తను మాత్రం అందుబాటులోనే ఉంటాననే విషయాన్ని పోలీసులకు చెప్పినట్టు వెల్లడించాడు.

తాజా సమాచారం ప్రకారం, నవదీప్ మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాల్ డేటాను ఇప్పటికే బయటకు తీసిన పోలీసులు.. ఈసారి ఛాటింగ్, మెసేజింగ్ డేటాను కూడా వెలికితీసి, అప్పుడు మరోసారి నవదీప్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది.