సినిమాల్లో మెగాస్టారే కావొచ్చు కానీ, చిరంజీవి రాజకీయాల్లో రాణించలేకపోయారు, తనకు వర్కవుట్ కాదు అనుకున్న వెంటనే దుకాణం సర్దేయడం మాత్రం కొంతలో కొంత మేలు. అప్పటికే ఎమ్మెల్యే హోదా అనుభవించారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా ఓ వెలుగు వెలిగారు. అయితే చిరంజీవి తిరిగి పాలిటిక్స్ లోకి రావాలని, ఎప్పటికైనా ఆయన కింగ్ కావాలని, లేదా కింగ్ మేకర్ గా మారాలనేది అభిమానుల ఆశ.
అభిమానులకు ఆశలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అవి ఆచరణలో సాధ్యమేనా అనేది అనుమానం. అయితే గాడ్ ఫాదర్ అనే సినిమా టైటిల్ రిలీజైన తర్వాత మెగా అభిమానుల్లో సందడి మళ్లీ మొదలైంది. రాజకీయాల్లో కూడా చిరంజీవి గాడ్ ఫాదర్ అవుతారని అంటున్నారు. అది వాళ్ల అభిమానం.
చిరంజీవికి రాజకీయాల్లో అంత సీన్ లేదు, అసలాయనకి ఆ ఆసక్తి కూడా లేదు. అప్పటివరకూ అజాత శత్రువుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చాలామందికి శత్రువయ్యారు. ఆహా ఓహో అంటూ చిరుని పొగిడేవాళ్లు, ఆయన్ని అభిమానించేవారు సైతం.. చిరుని విమర్శించారు.
ప్రచారంలో ఆయనపై కోడి గుడ్లు విసిరారు. అందుకే ఆయనకు రాజకీయాలంటే ఏవగింపు కలిగింది. జీవితంలో మరోసారి చిరంజీవి రాజకీయాల్లో వేలు పెట్టరనేది ఆయన మనసెరిగినవారి మాట. అలాంటి చిరంజీవి పవన్ కు, జనసేనకు ఎప్పటికీ గాడ్ ఫాదర్ కాలేరు. పైగా బీజేపీ చేతుల్లో పవన్ ఉన్నంత కాలం చిరంజీవి తమ్ముడి రాజకీయాల్లో అస్సలు జోక్యం చేసుకోరు.
కానీ లూసిఫర్ రీమేక్ గా చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకి, రాజకీయాలకు లింకు ఉండటం.. తమ్ముడి రాజకీయ జీవితాన్ని సెట్ రైట్ చేసి, తమ్ముడి పార్టీకి అండగా ఉండే వ్యక్తిగా చిరంజీవి క్యారెక్టర్ ఉండటం ఇక్కడ కొత్త ఆశలకు జీవం పోస్తోంది.
లూసిఫర్ అనే సినిమాని చిరంజీవి అందుకే ఎంచుకున్నారని, రియల్ లైఫ్ లో కూడా ఆయన తమ్ముడికి, తమ్ముడి పార్టీకి అండగా ఉంటారనేది అభిమానుల ఆశ. గాడ్ ఫాదర్ అనే టైటిల్ బయటకు రావడంతో వారి ఆశ రెట్టింపైంది కూడా.
ఒకవేళ పవన్ బీజేపీ నుంచి దూరం జరిగినా, చిరంజీవి ఆయనకు చేదోడువాదోడుగా ఉండకపోవచ్చు. తన సినిమాలేవో తాను చేసుకుంటున్నారు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 4 సినిమాలు లైన్లో పెట్టారు.
సినిమాలే లోకంగా బతికేస్తున్న చిరంజీవి, రాజకీయాలకు ఇక పూర్తిగా దూరమైనట్టే అనుకోవాలి. ఎట్ లీస్ట్.. 2024 ఎన్నికల వరకైనా ఆయన రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.