ఒకవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు భయపెడుతున్నాయి. మరోవైపు అలాంటి ఆలోచనలకు మనసులో చోటు ఇవ్వద్దనే సూచనలు. రెండూ మన సమాజం నుంచే రావడం గమనార్హం.
కరోనా సెకెండ్ వేవ్ బాగా తగ్గుముఖం పట్టిందని జనం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో, థర్డ్ వేవ్ సంకేతాలు భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అభిప్రాయాలు కాస్త ధైర్యాన్ని ఇస్తున్నాయి.
ఖైరతాబాద్ ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ఆలోచన కూడా రాకూడదన్నారు. మూడో ముప్పు మాటే లేదని ధీమాగా చెప్పారు. అయితే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒకవేళ కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్ల చాలా మంది టీకా వేయించుకోడానికి వస్తున్నారని చెప్పారు. భయం వల్లే చాలా మంది టీకాకు దూరంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తయిన తర్వాత రాష్ట్రమంతటా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని ఆయన చెప్పుకొచ్చారు.