‘అమ్మా…డాడీ(ఫర్హాన్ ఫర్నిచర్ వాలా) మరో పెళ్లి చేసుకున్నట్లే.. నువ్వు కూడా మరో పెళ్లి చేసుకో. డాడీ చూడండి లైలా ఆంటీ (ఫిరోజ్ ఖాన్ కూతురు లైలా ఖాన్) అలాగే ఇప్పుడు వారికి ఓ బిడ్డ కూడా ఉంది’ అని తన పిల్లలు తరచూ తనతో అంటుంటారని బాలీవుడ్ సీనియర్ నటి పూజా బేడీ చెప్పుకొచ్చారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం మన మంచికే తప్ప అవి మనల్ని బాధించవని ఆమె చెప్పుకొచ్చారు.
ఇటీవల ఓ ఇంగ్లీష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా బేడీ అసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తన వివాహం, విడాకులు, ఆ తర్వాత మరో వ్యక్తితో రిలేషన్‌షిప్ గురించి నిర్మొహమాటంగా ఆమె తెలిపారు. పూజా బేడీ 1994లో ఫర్హాన్ ఫర్నిచర్ వాలాను పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పూజా, ఫర్హాన్‌లు 2003లో విడాకులు తీసుకున్నారు. వీరికి అలియా, ఒమర్‌లు ఇద్దరూ పిల్లలు. ప్రస్తుతం వారు పూజాతోనే ఉన్నారు.
పూజా భర్త ఫర్హాన్ ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత ఫిరోజ్ ఖాన్ కూతురు లైలా ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ప్పుడు ఓ బిడ్డ ఉంది. ఇదిలా ఉండగా ఆ తర్వాత కాలంలో మనేక్ కాంట్రాక్టర్‌తో పూజా ప్రేమలో పడ్డారు. తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు గత ఏడాది ప్రేమికుల రోజు పూజా, మనేక్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె తాజా ఇంటర్వ్యూలో తన పెళ్లి, పిల్లల గురించి చెప్పారు.
తన బాయ్‌ఫ్రెండ్ మనేక్‌ను తన పిల్లలు కూడా ఎంతో ఇష్టపడతారన్నారు. మనేక్‌తో పెళ్లి ప్రస్తావన తేగా పిల్లలు మాత్రం తనను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నారన్నారు. ఇదే సమయంలో పెళ్లి చేసుకోవడం కంటే కూడా జీవితంలో “ఇది నాది” అనేలా తాను స్థిరపడాలనుకుంటున్నట్టు చెప్పారు. ఇప్పుడు తనకు అదే ముఖ్యమని అన్నారు.
‘వారి జీవితంలోకి నేను తీసుకొచ్చిన అద్భుతమైన వ్యక్తిని వారు ఇప్పటికి ఇష్టపడతారు. అలాగే నా మాజీలను కూడా వారు ఇష్టపడతారు. కానీ వీటి కారణంగా నేను ఆందోళన, గందరగోళానికి గురికావోద్దని వారు నాకు చెబుతారు. ఇక మనేక్‌ను కూడా వారు చాలా ఇష్టపడుతున్నారు. అంతేగాక వాళ్ల డాడీ (ఫర్హాన్ ఫర్నిచర్ వాలా) మరో పెళ్లి చేసుకున్నట్లే.. నన్ను కూడా మరో పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉంటారు’ అని పూజా చెప్పుకొచ్చారు.
ఒక వివాహం జీవితంలో సరైనది కాకపోతే మళ్లీ పెళ్లి చేసుకునే అవసరం లేదన్నారు. తన తండ్రి కబీర్ బేడీ నాలుగు వివాహలు చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. వాటి వల్ల ఆయన మరింత బలవంతుడు అయ్యాడని చెప్పడం విశేషం.