టైమ్ బాగలేకపోతే…అంతే మరి. టాలీవుడ్ హీరో రామ్‌కు బ్యాడ్ టైం నడుస్తోంది. ఇది కోరికోరి కొని తెచ్చుకున్నదే. విజయవాడలో స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం జరగడం, పది మంది మృత్యువాత పడడం తెలిసిందే. ఇది రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తుండడంతో సహజంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే సదరు రమేశ్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేశ్ కేసులో ఇరుక్కోవడంతో హీరో రామ్ ట్విటర్ వేదికగా జగన్ సర్కార్‌పై వివాదాస్పద ట్వీట్లు చేశాడు. ముఖ్యమంత్రి జగన్‌ను మరెవరో పక్కదాని పట్టిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని, అలాగే కులం తదితర అంశాలను ప్రస్తావించాడు. దీంతో పోలీసులకి చిర్రెత్తుకొచ్చి….”రామ్ మీ పనేంటో చూసుకోండి. విచారణ ఎలా చేయాలో మాకు తెలుసు. పోలీసులకు కులమతాలు, బంధుత్వాలు ఉండవ”ని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు.
సరే రామ్ గురించి అంతటితో చర్చ ముగిసిపోయిందనుకుంటున్న తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో పాటు హీరో రామ్‌ను ఉతికి ఆరేశారు. కులం పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపిందా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఒక్కడే తమ సామాజిక వర్గానికి నాయకుడు కాదని తేల్చి చెప్పారు. గతంలో చాలా మంది నాయకులు తమ కోసం పని చేశారన్నారు. చంద్రబాబుతోనే తమ సామాజిక వర్గానికి ముప్పు అని వంశీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే అదనుగా సినీ హీరో రామ్‌పై కూడా వంశీ ఫైర్ అయ్యారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ్ సినిమాలు ఒక్క అతని సామాజిక వర్గం వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా? వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి అంటూ వంశీ తనదైన శైలిలో ఛాలెంట్ విసిరారు.
వంశీ చేతిలో చిక్కి టీడీపీ ఎమ్మెల్సీలు బాబురాజేంద్రప్రసాద్, అశోక్‌బాబులకు ఏ గతి పట్టిందో తెలిసి కూడా… కౌంటర్ ఇస్తే ఏమవుతుంది? ఇవ్వకపోతే ఏమవుతుంది? అనే సరికొత్త సంశయం రామ్‌కు ఎదురైంది. చిత్రపరిశ్రమలో ఎంతో భవిష్యత్ ఉన్న రామ్…తెలియక అనవసరంగా ఏపీ రాజకీయాల్లో తలదూర్చి ఇబ్బంది పడుతున్నాడు.