ఆంధ్రలో ఓ జాతీయ పార్టీ వుంది. దాని పేరు తెలుగుదేశం. దానికి జాతీయ అధ్యక్షుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో వర్కింగ్ ప్రెసిడెంట్, ఓ జాతీయ కార్యదర్శి వున్నారు. ఆ విధంగా అది జాతీయ పార్టీగా చలామణీలో వుంది.
ఇక అదే ఆంధ్రలో జనసేన అనే మరో పార్టీ వుంది. దానికి ఓ జాతీయ అధ్యక్షుడు, ఇద్దరు బాధ్యులు చెరో రాష్ట్రానికి వున్నారు. కానీ ఈ రెండు పార్టీల నేతల రంకెలు కేవలం ఆంధ్ర ప్రదేశ్ వరకే. తెలంగాణ వరకు వచ్చేసరికి పిల్లి పిల్లలే. మియావ్ మియావ్ అనడం తప్ప గాండ్రించడం అన్నది ఎప్పడో మరిచిపోయాయి.
ఆంధ్రలో చీమచిటుక్కు మంటే సర్రున లేచిపోతాయి ఈ రెండు పార్టీలు. లక్షలు కాదు, కోట్లు నష్టపరిహారం డిమాండ్ చేస్తాయి. ఈకకు ఈక, తోకకు తోక పీకి మరీ యాగీ చేస్తాయి. కానీ అదే తెలంగాణ వరకు వచ్చేసరికి జస్ట్ ఓసారి అలా ప్రస్తావించి ఊరుకుంటాయి.
ఎందుకంటే జగన్ అంటే అలుసు..కేసిఆర్ అంటే భయం. ఇక్కడ భయం అనే కన్నా ఇంకో రెండు అక్షరాల పదం వాడొచ్చు కానీ, జర్నలిజం సభ్యత సంస్కారాలు అడ్డం పడతాయి. ఆంధ్రలో ఓ హోటల్ కాలిపోయింది. ప్రభుత్వం సహాయం అందివ్వాలంటూ డిమాండ్. ఓ కంపెనీలో లీకులు వచ్చాయి. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్.
అదే తెలంగాణలో ఏకంగా ప్రభుత్వ విద్యుత్ కేంద్రంలో దారుణ, దురృష్టకర ప్రమాదం. కానీ సానుభూతి ప్రకటనలు మినహా, నష్టపరిహార డిమాండ్ అన్నది పొరపాటున కూడా వినిపించదు. ఎందుకంటే కెసిఆర్ అంటే….
సరే, ఈ సంగతి అలా వుంచుదాం. నిన్నటికి నిన్న కేంద్రం సర్వ సర్వేక్షణ్ పలితాలు ప్రకటించింది. ఆంధ్రలోని విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాలు తమ తమ ర్యాంకులను చాలా విభాగాల్లో మెరుగుపర్చుకున్నాయి. కానీ లక్షలోపు జనాభా విభాగంలో మాత్రం కాదు. వెంటనే తెలుగుదేశం పార్టీ ఆ పాయింట్ ను పట్టుకుని చంద్రబాబు లేకపోయేసరికి ఇలా అయింది అంటూ యాగీ ప్రారంభించింది.
సరే కాస్సేపు అదే నిజం అనుకుందాం. కానీ తెలంగాణాలోనే హైదరాబాద్ మహా నగరం ఈ సర్వేలో సోయలోకి లేకుండా పోయింది. మరి ఈ విషయంలో కేసిఆర్ ను టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ అయినా తెలుగుదేశం పార్టీ వదిలిందా? అమ్మో..అంత పని చేయడమే? కేసిఆర్ ఊరుకుంటాడా? తాట తీసి వదిలిపెడతారు. అసలే కేసిఆర్ అంటే….
జగన్ అంటే అలుసు. పైగా ఆంధ్రలో మన మీడియా వుంది. మనం ఏం మాట్లాడినా ప్రచురిస్తుంది..ప్రసారం చేస్తుంది. వీలయినంత హైలైట్ చేస్తుంది. కానీ తెలంగాణలో అదే 'మన' మీడియా 'మనను' లెక్కచేయదు..పక్కన పెడుతుంది. ఎందుకంటే దాని భయాలు దానివి..దాని వ్యవహారాలు దానివి. అందువల్ల కూడా ఈ జాతీయ పార్టీలు ఇక పెద్దగా మాట్లాడవు.
ఆంధ్రలోనే ఈ హల్ చల్ అంతా..ఎందుకంటే జగన్ అంటే లోకువ కదా.