టాలీవుడ్ లో పూజాహెగ్డేకు ఎవరు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇద్దరు దర్శకులు మాత్రం ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వాళ్లలో ఒకరు త్రివిక్రమ్ కాగా, రెండో దర్శకుడు హరీశ్ శంకర్. వీళ్లలో త్రివిక్రమ్ కు పూజాహెగ్డే కమిట్ మెంట్, డెడికేషన్ ఇష్టం. ఇక హరీశ్ శంకర్ అయితే పూజాహెగ్డేను సెంటిమెంట్ గా ఫీల్ అవుతాడు.
ఇప్పుడీ ఇద్దరు దర్శకులు పూజాహెగ్డేకు హ్యాండ్ ఇచ్చారు. అదే విచిత్రం.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరుకారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనేది వేరే విషయం. త్రివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే లేదనేది పెద్ద షాకింగ్ అంశం.
ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఈ బ్యూటీకి హ్యాండ్ ఇచ్చాడు. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు హరీశ్. ఇందులో పూజాహెగ్డే కోసం ఓ పాత్ర సిద్ధంగా ఉన్నట్టు కొన్నాళ్లుగా వార్తలొచ్చాయి. అయితే తాజాగా సాక్షి వైద్యను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారు.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజాహెగ్డేకు చోటు లేదనే విషయం తేలిపోయింది. ఈ మూవీలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీల, సెకెండ్ హీరోయిన్ గా సాక్షి వైద్య కనిపించనున్నారు.
గుంటూరుకారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోవడానికి దర్శకుడిపై మహేష్ బాబు ఒత్తిడి ప్రధాన కారణం అని చెబుతారు చాలామంది. 'ఉస్తాద్' నుంచి పూజాహెగ్డేను తప్పించడానికి కారణం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
దర్శకుల సెంటిమెంట్స్ సంగతి పక్కనపెడితే.. ఇటు మహేష్, అటు పవన్ కల్యాణ్ లాంటి ఇద్దరు పెద్ద హీరోల సినిమాల్ని పూజాహెగ్డే మిస్ చేసుకుంది. ఆమె కెరీర్ కు ఇది పెద్ద దెబ్బ.
ఇదిలా వుంటే…పవన్-హరీష్ శంకర్ సినిమాకు పూజా ను ఏనాడూ ఎవరూ సంప్రదించలేదని హీరోయిన్ పూజా పర్సనల్ మేనేజర్ హరి తెలిపారు.