రామ్ గోపాల్ వర్మది ప్రచార ఆర్భాటం, తను ఏదో విధంగా వార్తల్లో ఉండటమే ఆర్జీవీ లక్ష్యం. దీని కోసం ఏమైనా చేస్తాడని చెప్పలేం కానీ, సినిమా అనౌన్స్ మెంట్లు అయితే చేస్తాడు! మొదట్లో ఆర్జీవీ కేవలం అనౌన్సర్ పాత్రకే పరిమితం అయ్యేవాడు. అయితే ఆ తర్వాత ఏదోలా వివాదాస్పద అంశాలపై సినిమాలు కూడా చుట్టేస్తున్నాడు ఆ దర్శకుడు. ఈ సినిమాలకు ప్రత్యేకంగా బడ్జెట్ పెడతాడని కూడా ఎవరూ అనుకోవడం లేదు. ఔత్సాహిక నటీనటులు ఉండనే ఉంటారు.
ఎవరైనా కాస్త నటులను తీసుకున్నా.. వారి షూటింగ్ పార్ట్ ఏ ఒకటీ రెండు రోజులకు మించి ఉండదు. దీంతో పెద్దగా పెట్టుబడి లేకుండానే ఆ సినిమాలను వర్మ రూపొందించేస్తాడు. ఇన్నాళ్లూ థియేటర్లో విడుదల చేయాలనే లెక్క అయినా ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు! ఫలానా సినిమా థియేటర్లో విడుదల అయితేనే.. ప్రేక్షకులకు చేరువ అవుతుంది అనే లెక్కలే లేవు. ఒక వెబ్ సైట్ స్టార్ట్ చేస్తే సినిమా విడుదల చేసేసుకున్నట్టే! అలాంటి వీక్షణకూ వర్మ ఎంతో కొంతో టికెట్ రేటు పెట్టి, తను పెట్టిన నామమాత్రపు పెట్టుబడిని అయినా రాబట్టుకుంటూ ఉండవచ్చు!
ఏతావాతా రామ్ గోపాల్ వర్మ ప్రచార కాంక్ష మాత్రం పుష్కలంగా తీరుతోంది. ఆ తరహా ప్రచారం, ఆ తరహా సినిమాలు తీయడాన్ని మెజారిటీ మంది ఇష్టపడకపోవచ్చు. వారితో వర్మకు పని లేదు. తనకు ఇష్టం కాబట్టే తను తీస్తానంటూ వర్మ చాలా సంవత్సరాలుగా చెబుతూ ఉన్నాడు. చూసే వాళ్లతో తనకు పని లేదని వర్మ చెబుతూ వస్తున్నాడు. కొన్నేళ్లకు అలా కూడా వర్మపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లడంతో ఇప్పుడు పూర్తి వివాదాస్పద రూటు పట్టాడు. నిజజీవిత ప్రముఖులను గిల్లుతూ ఉన్నాడు ఆర్జీవీ. అదేమంటే కల్పితమని తేల్చేస్తూ ఉన్నాడు.
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ సినిమా అనౌన్స్ చేయడం, ఆ సినిమా మైనస్ స్థాయి రేటింగ్స్ తో అలా వెళ్లిపోవడం, ఆ తర్వాత జనాలు కూడా దాన్ని మరిచిపోవడం జరిగింది. ఒకవేళ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా వర్మను ఇప్పుడు అలాగే వదిలేసి ఉంటే.. కథ అంతటితో ముగిసేది. అయితే ఆర్జీవీ పవన్ ఫ్యాన్స్ ను గిల్లితే, వాళ్లు ఆర్జీని రక్కుతూ ఉన్నారు!
పవన్ కల్యాణ్ ను అంటే తమ అభిమానాన్ని గాయపరుచుకునే అభిమానులు కొందరు, ఇదే సమయంలో ఆర్జీవీపై ఇష్టానుసారం మాట్లాడి తాము పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గా ప్రచారం తెచ్చుకోవాలనుకునే వాళ్లు కొందరు. వీళ్లంతా పవన్ భజన ద్వారా తమ ప్రమోషన్, తమ సినిమాలకు కలెక్షన్స్ తెచ్చుకోవాలని చూసే బాపతనమాట. మమూలుగా వీళ్లను జనాలు పట్టించుకోరు. వీళ్లకూ ప్రచారం కావాలి. ఆ ప్రచారం కావాలంటే ఆర్జీవీని తిట్టాలి! అది ఉచిత ప్రచారం.
స్థూలంగా పవన్ మీద వ్యంగ్య సినిమాతో ప్రచారం పొందుతున్న ఆర్జీవీకి, ఆర్జీవీని ఇష్టానుసారం తిడుతూ వార్తల్లో వస్తున్న వారికీ పెద్ద తేడా లేదు. వీళ్లందరికీ కావాల్సింది పబ్లిసిటీ! ఏదో రకంగా వార్తల్లో ఉండటం. స్థూలంగా ఈ రెండు వర్గాలనూ సీరియస్ గా తీసుకునే వాళ్లెవరైనా ఉంటే వాళ్లు అమాయకులు!