2004లో కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు వచ్చిన మెజారిటీ దాదాపు 59 వేలు. ఆ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఉమ్మడి ఏపీ సీఎంగా తొమ్మిదేళ్ల పాలన తర్వాత చంద్రబాబు అలా తిరస్కరణ పొందారు. 2009లో చంద్రబాబు నాయుడుకు కుప్పంలో వచ్చిన మెజారిటీ 46 వేలు! ఐదేళ్ల ప్రతిపక్ష వాసం అనంతరం చంద్రబాబు నాయుడుకు ఆ మేరకు ఓట్లు పోయాయి. 2014లో విభజిత ఏపీలో తెలుగుదేశం గెలిచినా, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ 47 వేలు. మళ్లీ ఐదేళ్ల పాలన అనంతరం.. కుప్పంలో గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు వచ్చిన మెజారిటీ 26 వేలు!
గమనించాల్సిన అంశం ఏమిటంటే.. 2004 తర్వాత చంద్రబాబు నాయుడుకు ఎప్పుడూ ఆ స్థాయి మెజారిటీ రాలేదు. 2004తో పోలిస్తే 2019 నాటికి చంద్రబాబు నాయుడి మెజారిటీ సగానికి సగం అయ్యింది! గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వాళ్లు దాదాపు వందకు పైగా నియోజకవర్గాల్లో 20 వేలు, అంతకు మించిన మెజారిటీలు సాధించారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు, తొలి సారి పోటీ చేసిన వారు, తొలిసారి ఎమ్మెల్యేలుగా నెగ్గిన అనామకులు కూడా వైసీపీ తరఫున 30 వేలు, 40 వేల స్థాయి మెజారిటీలు సాధించారు! అయితే చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటి వారి మెజారిటీ నంబర్ తో సగం స్థాయిలో నిలబడ్డారు.
కుప్పంలో చంద్రబాబు నాయుడికి ఆదరణ క్రమం తప్పకుండా తగ్గిపోతూ ఉంది. పార్టీకి ఊపు ఉన్న సమయాల్లో ఆయన చెప్పుకోదగిన మెజారిటీ సాధిస్తున్నారు. పార్టీ ఊపు లేకపోతే ఆయన సాధారణ నేత స్థాయిలో గెలుస్తున్నారంతే! 1989 నుంచి కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికీ ఆయన ప్రజల పూర్తి విశ్వాసాన్ని సొంతం చేసుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. ముఖ్యమంత్రి, అంతర్జాతీయ నేత అనే ఇమేజ్ ల నేపథ్యంలో కూడా ఆయన కుప్పంలో మాత్రం తిరుగులేని నేత కాలేకపోతున్నారు!
ఇక ప్రస్తుత పరిణామాలు చంద్రబాబు నాయుడుకు మరింత వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నియోజకర్గంలో క్యాడర్ పూర్తిగా చేజారి పోతోందట. చంద్రబాబు నాయుడు కుప్పాన్ని అసలు పట్టించుకున్న దాఖలాలు పెద్దగా కనిపించవు కూడా. ఏదో చుట్టపుచూపుగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వైపు ఆయన వెళ్తుంటారు. ఇలాంటి క్రమంలో నియోజకవర్గంలో ఆయన పట్టు జారుతున్నట్టుగా ఉంది.
ఈ పరిస్థితులు గమనిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాలు పెద్దగా ఏమీ లేవు. కుప్పం కూడా అందుకు మినహాయింపు కాదు. ఇలాంటి నేపథ్యంలో క్యాడర్ జారిపోతే.. నియోజకవర్గంలో వచ్చేసారి పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవడం కాదు, అలాంటి ధైర్యం చేయడమే సాహసం అవుతుందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మొత్తానికి చంద్రబాబు పనితీరు అలా ఉందేమో!