పెద్ద సినిమాలు అంటేనే భారీ బడ్జెట్. అంత ఖర్చు రికవరీ కావాలంటే అదనపు రేట్లు వుండాల్సిందే. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కాస్త ఉదారంగానే వ్యవహరిస్తున్నాయి.
ప్రోపర్ సిస్టమ్ ప్రకారం దరఖాస్తు చేసుకుంటే అనుమతి ఇస్తున్నాయి. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సలార్ చాలా భారీ సినిమా. వందల కోట్లు ఖర్చు అయింది. ఆ మేరకు సినిమాను భారీగానే మార్కెట్ చేసారు. ఈ మేరకు రికవరీ కావాలంటే అదనపు రేట్లు అవసరం.
అందుకే 75 రూపాయల అదనపు టికెట్ రేట్ల కోసం సలార్ నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆంధ్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్ర (సీడెట్ మినహా) ఏరియా కు 85 కోట్ల మేరకు మార్కెట్ చేసారు. మామూలు పెద్ద సినిమాలు నలభై నుంచి యాభై కోట్ల మేరకు మార్కెట్ చేస్తారు. అంటే డబుల్ రేటు పెడితే తప్ప కిట్టదు. అంత కాకపోయినా 150 రూపాయలకు 75 రూపాయల మేరకు పెంచితే బయ్యర్లు సేఫ్ కావడం సులువు అవుతుంది.
ఆంధ్రలో టికెట్ రేట్లు పెంచాలంటే కొన్ని విధి విధానాలు వున్నాయి. వాటికి అనుగుణంగానే సలార్ మేకర్లు టికెట్ రేట్లు పెంపుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.