ఏకగ్రీవం నాకు ఇష్టం లేదు: ప్రకాష్ రాజ్

“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది గౌరవప్రద సంస్థగా ఉండాలి. అధ్యక్ష ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలి.” అసోసియేషన్ ఏర్పాటుచేసిన కొత్తలో టాలీవుడ్ పెద్ద మనుషులు అనుకున్న మాట ఇది. అయితే ఆ తర్వాత అది…

“మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది గౌరవప్రద సంస్థగా ఉండాలి. అధ్యక్ష ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరగాలి.” అసోసియేషన్ ఏర్పాటుచేసిన కొత్తలో టాలీవుడ్ పెద్ద మనుషులు అనుకున్న మాట ఇది. అయితే ఆ తర్వాత అది నీట మూటగానే మిగిలింది. ఎన్నికలు జరగడం, వివాదాస్పదమవ్వడం సర్వసాధారణమైంది. ఈ క్రమంలో ఏకగ్రీవం అంశంపై తాజాగా అధ్యక్ష బరిలో నిలిచిన్ ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు.

ఏకగ్రీవం తనకు అస్సలు ఇష్టంలేదని కుండబద్దలు కొట్టారు ప్రకాష్ రాజ్.దీనికి ఆయన తనదైన  లాజిక్, విశ్లేషణ కూడా వినిపించారు.

“ఏకగ్రీవం అనేది నాకు ఇష్టం లేదు. ఎన్నికల్లో చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతోంది అదే. నేను ఏం చెబుతున్నానో అంతా వింటున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న సభ్యులు ఈ రెండేళ్లు ఏం చేశారో చూడాలి. నెక్ట్స్ ఏం కావాలి అనే చర్చ జరగాలి. అప్పుడే అసోసియేషన్ కు మంచిది. ఎవరో ఒకరి ఆశీర్వాదంతో  ఏకగ్రీవంగా గెలిస్తే ఏం జరగదు. ఏకగ్రీవంగా ఎవరో ఒకర్ని ఎన్నుకంటే చర్చకు తావెక్కడుంటుంది? అందుకే ఏకగ్రీవ ఎన్నికలపై నాకు నమ్మకం లేదు.”

ఇలా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా బయటపెట్టారు ప్రకాష్ రాజ్.  ఎన్నికలంటే ఓడిపోవడం, గెలవడం కాదని.. రెండేళ్లలో ఏం జరిగిందనే చర్చ జరిగి, తర్వాత రెండేళ్లకు మరో మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం అనే ప్రక్రియ జరగాలన్నారు. మరోవైపు మంచు విష్ణు, నరేష్ తో సంప్రదింపులపై కూడా స్పందించారు ప్రకాష్ రాజ్.

“మంచు విష్ణుతో గతంలోనే మాట్లాడాను. పోటీ చేస్తున్నానని చెప్పాను. అయ్యో అంకుల్ నాకు తెలీదు అన్నాడు. మీరు ఉన్నారని తెలియక నేను కూడా పోటీకి దిగానని చెప్పాడు. దాంట్లో ఏముంది నువ్వు కూడా పోటీ చేయి అన్నాను. నరేష్ కు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆల్ ది బెస్ట్ చెప్పాడు.”

తనను నాన్-లోకల్ అని విమర్శించే వాళ్లు.. అదే ఎజెండాతో ఎన్నికలకు వెళ్లాలని, నాన్-లోకల్ కు ఓటు వేయొద్దంటూ క్యాంపెయిన్ చేయగలరా అని సవాల్ విసిరారు ప్రకాష్ రాజ్.