విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ది అతి తెలివా లేక అజ్ఞానమా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా’ ఎన్నికల్లో ప్రత్యర్థి మంచు విష్ణు ప్యానల్ గెలుపొందడాన్ని ప్రకాశ్‌రాజ్ స్వాగతిస్తూనే , మరోవైపు వింత రాజకీయాలకు తెరలేపారు.
ప్రజాస్వామ్యంలో ఓటర్ల అభిప్రాయాన్ని గౌరవిస్తానంటూనే, తన ప్యానల్ సభ్యులను గెలిపించిన వారి అభిప్రాయాన్ని తుంగలో తొక్కడం గమనార్హం. ఎన్నికల అనంతరం ప్రకాశ్‌రాజ్ నడవడిక చూస్తుంటే…ఆయనది అతి తెలివా? లేక అజ్ఞానమా? అనే సందేహం కలుగుతోంది.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన తన ప్యానెల్ సభ్యులు 11 మందితో ఆయన మూకుమ్మడిగా రాజీనామా చేయించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదంతా సినిమాటిక్‌గా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజీనామాకు దారి తీసిన కారణాలు చాలా సంకుచితంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలు జరిగిన తీరు, అనంతర పరిణామాలు, కౌంటింగ్ సమయంలో మోహన్‌బాబు, నరేశ్ అనుచిత ప్రవర్తన, తదితర అంశాలపై రెండు రోజుల నుంచి తన సభ్యులతో చర్చించానని, ఘర్షణ వాతావరణంలో విష్ణు మంచు వర్గంతో కలసి పని చేయడా నికి ఇష్టం లేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నామని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. ఎన్నో కలలు, ఆశలతో ఎన్నికల్లో పోటీ చేశామని.. కానీ ఎన్నికల సమయంలో రౌడీయిజం రాజ్యమేలిందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు.
ఎక్కడెక్కడినుంచో మనుషుల్ని తీసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారనీ, పోస్టల్ బ్యాలెట్లో అవకతవకలు జరిగాయనీ, ఫలితాలను రాత్రికి రాత్రి మార్చేశారని ఆరోపించారు. గెలిచిన సభ్యులు విష్ణు వర్గంతో పనిచేయలేమని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకాశ్‌రాజ్ చెప్పారు.
ఎన్నికలంటే ఎలా జరుగుతాయో ప్రకాశ్‌రాజ్‌కు ఇప్పుడే తెలిసొచ్చిందా? ఎన్నికలంటేనే రౌడీయిజం, ఘర్షణ, ఒకరిపై మరొకరి ఆధిపత్యం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, బుజ్జగించడం, బతిమలాడడం, బెదిరించడం అన్నీ వుంటాయి. ఎన్నికల లక్షణాలే ఇవి. ఎన్నికలంటే శాంతిహోమం కాదు కదా! ఈ మాత్రం స్పృహ లేకుండానే ‘మా’ ఎన్నికల గోదాలోకి ప్రకాశ్‌రాజ్ ఎందుకు దిగారు?
మనం ఊహించినట్టు పరిస్థితులు ఎప్పుడూ ఉండవు. అన్నీ ఊహించినట్టే జరగాలనుకోవడం కంటే అజ్ఞానం మరొకటి లేదు. ప్రతికూల పరిస్థితులన్నింటిని ఎదుర్కొని నిలబడ్డ వాళ్లనే విజయం వరిస్తుందనే సూక్ష్మ విషయం ప్రకాశ్‌రాజ్‌కు తెలియకపోవడం నిజంగా ఆశ్చర్యంగా, వింతగా ఉంది.
ఈ మాత్రం సంబరానికి అసలు ఎన్నికల యుద్ధంలోకి ఎందుకు దిగారో ప్రకాశ్‌రాజ్ చెప్పాలని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదేదో ఏకగ్రీవం చేసుకుని ఉంటే ఈ గొడవే వుండేది కాదు కదా! ఎన్నికల వరకూ వెళ్లి, టాలీవుడ్లో చీలిక వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా చేసేదేముంది?
ప్రకాశ్‌రాజ్, ఆయన భావజాలాన్ని అభిమానిస్తున్న వాళ్లు కూడా ఇప్పుడీ రాజీనామా వ్యవహారాన్ని తప్పు పడుతున్నారు. ఎన్నికల్లోనే ప్రత్యర్థులు, ఆ తర్వాత మిత్రులనే భావన ప్రకాశ్‌రాజ్ ప్యానల్లో ఎందుకు కొరవడింది? ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఎదురొడ్డి పోరాడాలే తప్ప, ముందే ఏవేవో ఊహించుకుని పలాయనం చిత్తగించడం ఏంటని ప్రశ్నించే వాళ్లకు ప్రకాశ్‌రాజ్ ఏం సమాధానం చెబుతారు?
కేవలం 900 ఓట్లున్న ‘మా’ లో సమన్వయంతో పని చేసుకోలేమని భావించారే, మరి ప్రధాని మోడీతో సహా పాలకులను ప్రశ్నించే హక్కు తనకుందా? అనేది ఒక్కసారి ప్రకాశ్‌రాజ్ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.
గతంలో అధికారంలోకి రాలేదనే బాధ, నిరుత్సాహంతో ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కలిపారు. అలాగే పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ అధికారం అందని ద్రాక్షగా భావించి తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు.
ఇవన్నీ రాజకీయాలంటే అనుభవ, అవగాహన లేమి వల్ల చోటు చేసుకున్నవే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బహుశా ప్రకాశ్‌రాజ్‌కు మెగా బ్రదర్సే రోల్ మోడల్స్‌గా కనిపిస్తున్నట్టున్నారు. ఏదైనా తనదాకా వస్తే తప్ప తత్వం బోధపడదని పెద్దలు ఊరికే చెప్పలేదు. బహుశా ఎన్నికల పర్యవసానాలేంటో ప్రకాశ్‌రాజ్‌కు ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఉంటాయి.