విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్…తాను నటనలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా ప్రత్యేకమైన వ్యక్తినని చాటుకున్నారు. ప్రకాశ్‌రాజ్ ఏం చేసినా దానికో అర్థం, పరమార్థం వుంటాయి. ఏ ప్రయోజనం లేకుండా ఆయన ఏ పనీ చేయరనే టాక్ ఉంది. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియాలోనూ, టాలీవుడ్‌లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.
“జెండా” ఎగరేస్తాం…అంటూ ఆయన శనివారం సాయంత్రం ట్వీట్ చేశారు. మామూలుగా అయితే రేపు స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశ్‌రాజ్ ట్వీట్ చేశారని భావించొచ్చు. ఈ వేడుకను తన రాజకీయ అభిప్రాయాన్ని వ్యక్తపరిచేందుకు ఆయన అదును చూసి సద్వినియోగం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో జరగనున్న “మా” ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన ప్యానల్‌ను కూడా ముందే ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. “మా” ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ప్రకాశ్‌రాజ్‌తో పాటు మరో విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు తనయుడు విష్ణు, నటి హేమ, జీవిత తదితరులు ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుత “మా” అధ్యక్షుడు నరేష్‌పై ఘాటు విమర్శల నేపథ్యంలో హేమ క్రమశిక్షణ కమిటీ నుంచి షోకాజ్ నోటీసు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో మంచు విష్ణు కూడా సీరియస్ కామెంట్స్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ “జెండా” ఎగరేస్తాం అనే ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “మా” ఎన్నికల్లో గెలుస్తామనే సంకేతాన్ని ఈ ట్వీట్ ద్వారా ప్రకాశ్ పరోక్షంగా పంపారంటున్నారు. దీనిపైనే ఎక్కువ చర్చ సాగుతోంది.
కేవలం కొద్ది మంది మాత్రమే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన దేశ భక్తిని చాటుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి ట్వీట్‌తో ప్రత్యర్థులను ప్రకాశ్‌రాజ్ గిల్లారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రత్యర్థులు స్పందిస్తారా? లేదా? అనేది చూడాల్సి వుంది.