అక్రమార్కులెవరినీ వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ హెచ్చరించారు. రాష్ట్రంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చోటు చేసుకున్న నకిలీ చలాన్ల స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ నేపథ్యంలో రజత్ భార్గవ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
ఈ మార్చి 20 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన లావాదేవీలపై విచారణ చేపడతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చలానాలను తనిఖీ చేశామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 9 జిల్లాల్లో నకిలీ డాక్యుమెంట్లను సృష్టించారన్నారు. ఈ స్కామ్లో 10 మంది పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా రూ.5.40 కోట్ల విలువైన నకిలీ చలానాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. మొత్తం సొమ్ము రికవరీ చేస్తామని పేర్కొన్నారు. నకిలీ చలానాల వ్యవహారంపై డీఆర్ఐ ద్వారా విచారణ చేపడతామని తెలిపారు. కొన్ని పెండింగ్ డాక్యుమెంట్లను వాణిజ్య పన్నులశాఖకు పంపిస్తున్నట్టు ఆయన చెప్పారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని ఆయన అన్నారు.
మొట్ట మొదట నకిలీ చలానాల స్కాం ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగు చూసింది. కడపలో తీగ కదిపితే …రాష్ట్రమంతా కదులుతోంది. విచారణలో భాగంగా రోజుకో కొత్త మోసం బయటపడుతోంది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, అక్రమార్కుల ఆట కట్టించే పనిలో నిమగ్నమైంది.