హుజూరాబాద్ బై పోల్ విషయంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తన అభ్యర్థిని ప్రకటించేసింది. ఆ అభ్యర్థి వెళ్లి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కూడా సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ.. విజయం పట్ల భరోసా ఇచ్చారట.
సర్వేలన్నీ టీఆర్ఎస్ కే పట్టం కడుతున్నాయంటూ గెల్లు శ్రీనుతో అన్నారట కేసీఆర్. నువ్వు ఎమ్మెల్యేవి అయిపోతున్నావ్ పో.. అంటూ ఇలా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థికి భరోసా ఇచ్చినట్టుగా ఉన్నారు. ఇదే సమయంలో పార్టీనే నిన్ను గెలిపించేస్తోంది.. అనే ధ్వని కూడా వినిపిస్తుండవచ్చు.
ఇక టీఆర్ఎస్ బీసీ ఆయుధంతో బరిలోకి దిగుతుండటంతో.. బీజేపీ కూడా ఇక మరో మాట లేకుండా ఈటలనే బరిలోకి దించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఈటల బరిలోకి దిగుతారా.. లేదా మరొకరిని నిలిపి గెలిపించుకునే ప్రయత్నం చేస్తారా.. అనే చర్చ రేగినా, టీఆర్ఎస్ మూవ్ తో.. ఈటలే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
మరి ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనేది కూడా ఇక్కడ చర్చే. ఈ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలోకి దించుతుందనేది ఆసక్తిదాయకమైన అంశమే. అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ బీసీ అభ్యర్థిని అంటూ ప్రకటించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ ఒక డిఫరెంట్ మూవ్ తో వెళితే సంచలనమే అవుతుంది. హుజూరాబాద్ కు గతంలో రెడ్డి ఎమ్మెల్యేలు పని చేశారు. కాంగ్రెస్ గత అభ్యర్థులు కూడా ఇక్కడ వరసగా రెడ్లే. మరి కాంగ్రెస్ ఈ పరిణామాల్లో అలాంటి సాహసం చేస్తే డిఫరెంట్ గేమ్ కావొచ్చు.
అయితే.. అలాంటి అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒకవేళ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే, తమ పార్టీ స్థానిక నేత హోదాలో ఆయనకే కాంగ్రెస్ ప్రాధాన్యతను ఇచ్చేది. అయితే ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీసీలకే టికెట్ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మరెవరో కాదని.. కొండా సురేఖనే కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందనే వార్తలూ వస్తున్నాయి.
ఉమ్మడి ఏపీకే కొండా సురేఖ రాజకీయ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మాటల ఈటలను కూడా సంధించగల సురేఖ హుజూరాబాద్ రంగంలోకి దిగితే.. కాంగ్రెస్ వైపు నుంచి కూడా పోరు కాస్తో కూస్తో రసవత్తరంగా మారే అవకాశాలుంటాయేమో!