ఓటమిని ఎలా తీసుకోవాలో.. సినిమా వాళ్లకే బాగా తెలియాలి. ఎందుకంటే.. సినిమాల్లో చాలా డైలాగులే చెప్పి ఉంటారు. అలాగే ఒకసారి ఓడిపోగానే.. కాడి పక్కన పడేయడం కూడా గొప్ప నాయకత్వ లక్షణం కాదు. ఇది అందరికీ తెలిసిందే. నాయకుడు కావాలనుకునే వారికి చాలా ఓపిక ఉండాలి.
అదే గొప్ప అర్హత కూడా. అయితే మా అధ్యక్ష పదవికి ఎన్నికైతే అది చేస్తా.. ఇది చేస్తామన్న వారు… ఓడిపోయే సరికి కాడి పడేస్తున్నారు. ఇప్పటికే ఈ ఎన్నికల్లో వెనుకండి చాలా చేసిన నాగబాబు సభ్యత్వానికి రాజీనామా చేయగా, అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కూడా ఇప్పుడు రాజీనామాను ప్రకటించారు.
ఒకవైపు మా ఎన్నికలు చాలా చైతన్యవంతంగా జరిగాయంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని సమస్యల గురించి అందరికీ తెలసుని, హామీలన్నీ పూర్తి చేయాలన్నారు.
చైతన్యం అనే పదాన్ని వ్యంగ్యంగా ఉపయోగించారేమో ప్రకాష్ రాజ్. ఇక తన ప్రాంతం, జాతీయవాద అంశాల గురించి తెరపైకి తెచ్చారని ప్రకాష్ రాజ్ అన్నారు. తను తెలుగుబిడ్డను అని, కళాకారున్ని అని ప్రకాష్ రాజ్ అన్నారు. ఆ తర్వాత రాజీనామా అంశాన్ని ప్రకటించారు.
నాగబాబు కావొచ్చు, ప్రకాష్ రాజ్ కావొచ్చు… ఓటమితో కాదు, ఈ రాజీనామాలతో నిజంగా ఓడిపోయారు. ఎన్నికలు అన్నాకా గెలుపు, ఓటములు సహజం. జస్ట్ ఆరు వందల మంది ఓటేసిన చోట ఓటమిని వీరు తట్టుకోలేకపోతున్నట్టుగా ఉన్నారు. ఈ రాజీనామాలతో తాము ఓడిపోయినట్టుగా చాటుకుంటున్నారు.
ఎన్నికల్లో ఓటమి ఎవరి తప్పూ కాదు, అయితే ఇలాంటి రాజీనామాలు మాత్రం.. నిజమైన ఓటములు!