న‌న్ను పావుగా వాడుకోవాల‌ని అనుకుంటున్నారుః పూన‌మ్ కౌర్‌

న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంటారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టైల్‌లో ఆమె స్పందిస్తూ వుంటారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ టార్గెట్‌గా ఆమె ప‌రోక్షంగా విరుచుకుప‌డుతుంటార‌నే మాట వినిపిస్తుంటోంది. ప‌వ‌న్‌తో…

న‌టి పూన‌మ్ కౌర్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటుంటారు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌దైన స్టైల్‌లో ఆమె స్పందిస్తూ వుంటారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ టార్గెట్‌గా ఆమె ప‌రోక్షంగా విరుచుకుప‌డుతుంటార‌నే మాట వినిపిస్తుంటోంది. ప‌వ‌న్‌తో ఆమె గొడ‌వ ఏంటో ఎప్పుడూ బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. ప్ర‌పంచానికి చెప్పుకోలేని ఆవేద‌న ఏదో ఆమెను వెంటాడుతున్న‌ట్టుగా పూన‌మ్ అభిమానులు అంటుంటారు.

ఇక ప్ర‌స్తుతానికి వ‌స్తే పూన‌మ్‌కౌర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. త‌న‌ను రాజ‌కీయంగా కొంద‌రు పావుగా వాడుకుంటున్నార‌నే ఆవేద‌న ఆమె ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. పూన‌మ్ ప్ర‌క‌ట‌న‌లో ఏముందో తెలుసుకుందాం.

“అంద‌రికీ న‌మస్కారం. ఇప్ప‌టి వ‌ర‌కూ నేను ఏ రాజ‌కీయ పార్టీ కండువా క‌ప్పుకోలేదు. ఏ రాజ‌కీయ పార్టీకి సంబంధించిన వ్య‌క్తిని కాను. స‌మ‌స్య ఆధారంగానే నేను స్పందిస్తుంటాను. ఈ మ‌ధ్య కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు వారి ప్ర‌యోజ‌నాల కోసం న‌న్ను ఓ పావుగా వాడాల‌ని అనుకుంటున్నారు. ఇది స‌ముచితం కాదు. ఒక మ‌హిళ‌పై ఇలాంటి కుట్ర‌లు త‌గ‌వు. మ‌రి కొంద‌రు నాయ‌కులు సానుభూతి పేరుతో నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కు బిడ్డ‌ను, త్యాగాలు తెలుసు. పోరాటాలు తెలుసు. ద‌య‌చేసి మీ రాజ‌కీయాల కోసం న‌న్ను లాగొద్దు. ప్ర‌స్తుతం నేను చేనేత‌, మ‌హిళా ఉద్య‌మాల‌ను జాతీయ స్థాయిలో నిర్మించే ప‌నిలో వున్నాను. నా వైపు నుంచి ఏదైనా అప్డేట్ వుంటే నేనే స్వ‌యంగా తెలియ‌జేస్తాను” అని త‌న‌ను తాను సామాజిక కార్య‌క‌ర్త‌గా పూన‌మ్ కౌర్ ప‌రిచ‌యం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా ఆమెను రాజ‌కీయాల కోసం ఎవ‌రు? ఎలా వాడుకుంటున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వారాహియాత్ర‌లో ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ వాలంటీర్లు మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాకు పాల్ప‌డుతున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేయ‌డంపై పూన‌మ్ కౌర్ ప‌రోక్షంగా చుర‌క‌లు అంటించారు. ఈ ఏడాది జూలై 16న ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది.

“మహిళా భ‌ద్ర‌త‌ గురించి గొంతెత్తే నాయ‌కులు రెజ్లర్ల నిరసన సమయంలో మాత్రం నోరు మెద‌ప‌లేదు. ఇలాంటి ఫేక్ లీడర్లతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లకి అనుకూలంగా, అవసరం ఉన్నప్పుడే మాట్లాడుతుంటారు. జాగ్రత్తగా ఉండండి” అని ఏపీని హ్యాష్ ట్యాగ్‌గా పెట్టింది. ప‌వ‌న్ పేరు ఎత్త‌కుండా ఆమె చేసిన ట్వీట్‌.. ప‌రోక్షంగా జ‌న‌సేనాని గురించే అని నెటిజ‌న్లు కామెంట్స్ చేశారు. 

ఏపీ ప్ర‌జ‌ల్ని చైత‌న్య‌ప‌రిచే క్ర‌మంలో ఆమె ఏదో ఒక ట్వీట్ చేయ‌డం, మ‌ళ్లీ త‌న‌ను పావుగా వాడుకుంటున్నార‌ని పూన‌మ్ కౌర్ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌న బాధేదో నేరుగా చెబితే స‌రిపోతుంది క‌దా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.