రాజకీయాల గురించి రజనీకాంత్ ప్రకటనల పై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. మరో రెండేళ్లలోపే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. అప్పటికైనా రజనీకాంత్ పూర్తి స్థాయిలో రాజకీయ సన్నద్ధతను చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ సంగతలా ఉంటే.. మరో సినిమాను అనౌన్స్ చేస్తున్నాడట రజనీకాంత్. ఆ సినిమాకు దర్శకుడు కూడా కుదిరాడని సమాచారం.
సిరుతై శివ దర్శకత్వంలో రజనీకాంత్ తన తదుపరి సినిమాను ప్రకటించనున్నాడట. ఇప్పటికే వరసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు ఈ స్టార్ హీరో. 'పేట' తర్వాత 'దర్బార్' ను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతూ ఉంది ఈ సినిమా. ఇంకా అది షూటింగ్ అయినా పూర్తి కాక ముందే.. సిరుతై శివతో డిస్కషన్స్ ను పూర్తి చేశాడట రజనీకాంత్.
ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ కొన్ని మార్పులు సూచించాడని, అవి కూడా ఓకే అయిపోయాయని.. దర్బార్ షూటింగ్ అలా ముగిసిందో లేదో.. వెంటనే ఆ సినిమా సెట్స్ మీదకు రజనీకాంత్ ఎంటర్ అవుతాడని ప్రచారం జరుగుతూ ఉంది.
మరి అసెంబ్లీ ఎన్నికల్లోపు వీలైనంతగా సినిమాలు చేసేయాలని రజనీకాంత్ ఈ సినిమాలకు ఓకే చెబుతూ ఉన్నారా, లేక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తే లేక ఇలా వరసగా సినిమాలను ఓకే చేస్తున్నారా.. అనేది చర్చనీయాంశంగా మారుతోందిప్పుడు!