రాజువయ్యా..మహరాజువయ్యా

బతుకులో కాదు చావులో తెలుస్తుంది మనిషి గొప్పదనం అంటారు పెద్దలు. ఆ లెక్కన చూస్తే బిఎ రాజు గొప్పోడు. ఆ లెక్కన కాదు ఏ లెక్కన చూసినా గొప్పోడే. నిజానికి బిఎ రాజు నిజంగా గొప్పోడే.…

బతుకులో కాదు చావులో తెలుస్తుంది మనిషి గొప్పదనం అంటారు పెద్దలు. ఆ లెక్కన చూస్తే బిఎ రాజు గొప్పోడు. ఆ లెక్కన కాదు ఏ లెక్కన చూసినా గొప్పోడే. నిజానికి బిఎ రాజు నిజంగా గొప్పోడే. అస్సలు కల్మషం లేని మనిషి. తన మ్యాగ్ జైన్, తన సినిమాలు, తన వ్యవహారాలు తప్ప వేరేవి పట్టని జర్నలిస్ట్.  ఆధునిక పీఆర్వో వ్యవహారాలకు ఆద్యుడు. చెన్నయ్ నుంచి హైదరాబాద్ వరకు సినిమా వ్యవహారాలకు జర్నలిస్టిక్ సాక్షి. బిఎ రాజు మాదిరిగా సినిమాను ప్రేమించేవారిని, సినిమా తరపున అడ్డంగా వాదించేవారిని మరొకర్ని చూడలేం.

''..సినిమాను విమర్శించడానికి మనం ఎవరం? వాళ్ల డబ్బులతో వాళ్లు తీసుకున్నారు. మీకు నచ్చితే చూడండి లేదంటే మానండి. నా దృష్టిలో ప్రతి సినిమా సూపర్ హిట్ నే. నాకు అంతగా విమర్శించాలని వుంటే, నా డబ్బులతో నేను సినిమా తీసి అప్పుడు చేస్తా ఆ పని….''  ఇదీ బిఎ రాజు వాదన.

రోజూ ఒకటయినా సినిమా చూడకుండా నిద్రపోడు. అది ఆయన దినచర్యలో ఆఖరి ఘట్టం. కొత్త జర్నలిస్ట్ అయినా అదే మర్యాద.సీనియర్ మోస్ట్ అయినా అదే మర్యాద. అందుకే ఇండస్ట్రీలో బిఎ రాజు అందరివాడు అయ్యాడు. ఆయన పిఆర్ లతో సంబంధం లేదు. అన్ని సినిమాలు ఆయనవే. అన్ని ఆఫీసులు ఆయనవే. అందరు హీరోలూ ఆయనవారే. 

ఎక్కడా పొరపాటున ఒక్క నెగిటివ్ మాట వచ్చిన వైనం ఎవ్వరికీ తెలియదు. తమ తమ పీఆర్వోలను హీరోలు మార్చుకున్నా, అవసరం అయితే ఫోన్ మాత్రం బిఎ రాజుకే. అందరి తలలో నాలుకలాంటి మనిషి. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం బిఎ రాజుకు నివాళులు అర్పిస్తోంది.

ఏ రోజూ ఈ వార్త ఎందుకు రాసారు అని కాకుండా, ఈ వార్త రాస్తారూ అని మాత్రమే అడిగిన ఏకైక పీఆర్వో. సినిమా అన్నా, జర్నలిజం అన్నా పాజిటివ్ దృక్పథం తప్ప నెగిటివ్ అన్న థాట్ ఏ కోసానా లేని ఏకైక సినిమా జర్నలిస్ట్ బిఎ రాజు. 

జీవితాన్ని జీవితంలా అనుభవించి జీవించడం అంటే బిఎ రాజు తరువాతే. ఎప్పుడూ నవ్వుతూ వుండడం, ఎక్కడయినా నవ్వుతూ కనిపించడం, ఎప్పుడూ హుషారుగా వుండడం బిఎ రాజు దగ్గర చెక్కు చెదరని లక్షణాలు. 

గ్రేట్ ఆంధ్ర ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తోంది. ఆయన లేని లోటు సినిమా ఇండస్ట్రీకి ఎంతో కొంత  ఇండస్ట్రీ వున్నంత కాలం వుంటుంది. ఆయన ఆత్మ ఎక్కడ వున్నా కుటుంబం అని కాకుండా సినిమా..సినిమా అంటూ పరితపిస్తూనే వుంటుంది. ఎందుకంటే సినిమానే ఆయన కుటుంబం..ఆయన లేని సూపర్ హిట్ ను తలుచుకుంటేనే ఎక్కడో గుండె తడి అవుతోంది.కన్ను చెమ్మగిల్లుతోంది

బిఎ రాజు ఆఖరి ఇంటర్వూ లింక్ ఇది.  ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడగని బిఎ రాజు తన పుట్టినరోజు అంటే మాత్రం, చిన్న పిల్లాడిలా..ఏదైనా రాయచ్చుగా నా గురించి అనేవారు. ఈసారి మీతో ఇంటర్వ్యూ వేస్తా అంటే..మొన్న జనవరిలో ఎందుకూ అంటూనే ఇలా సమాధానాలు చెప్పారు

https://telugu.greatandhra.com/viewnews.php?id=114357&sec=news

విఎస్ఎన్ మూర్తి.