నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో కొట్టినట్టు నిర్ధారణ అయ్యింది. ఇక శిక్ష ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. అయితే రఘురామను కొట్టినట్టు నిర్ధారించింది మాత్రం ఈనాడు పత్రిక అని గుర్తించాల్సి ఉంది.
మన దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా నిర్ధారణకు రాని విధంగా… చంద్రబాబు రాజగురువు రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు మీడియా తుది తీర్పు వెలువరిస్తూ కథనం రాయడం గమనార్హం. అయితే ఇదేమీ ఆశ్చర్యం కలిగించడం లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా ఎల్లో మీడియానే జగన్‌కు సంబంధించిన కేసుల్లో తీర్పులిస్తున్న సంగతి తెలిసిందే.
ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో ఆయన కాలి గాయాలు తీవ్ర రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. దీనిపై గుంటూరు జీజీహెచ్ మెడికల్ రిపోర్ట్‌ను పక్కన పెడితే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ సైనిక ఆస్పత్రి వైద్య పరీక్షలు చేసి నివేదిక సమర్పించింది. ఒకవేళ ఎంపీని కొట్టినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. నివేదిక అనంతరం ఎంపీ గాయం గురించి సుప్రీంకోర్టు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు.
“సైనికాస్పత్రి నివేదికను పరిశీలిస్తే పిటిషనర్‌పై కస్టడీలో అనుచిత ప్రవర్తన జరిగిందనడాన్ని తోసిపుచ్చలేం” అనే వ్యాఖ్యతో సుప్రీంకోర్టు సరిపెట్టింది. అనారోగ్య కారణాలను పరిగణలోకి తీసుకుని షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే రఘురామకృష్ణంరాజుకు షరతులతో కూడిన బెయిల్ టీడీపీకి, ఆ పార్టీని మోసే మీడియాకు రుచించలేదు. దీంతో తానే తుది తీర్పును ఈనాడు పత్రిక రాసుకొచ్చింది. అది ఎలా సాగిందంటే…
“సైనికాసుపత్రి వైద్యులు నివేదికలో వాడిన వైద్యపరిభాషను బట్టి చూస్తే రఘురామకృష్ణరాజును గట్టిగా కొట్టినట్లే తెలుస్తోందని నివేదికను చూసిన పలువురు వైద్య నిపుణులు అంటున్నారు. కొట్టినప్పుడు చిన్నచిన్న రక్తనాళాలు చిట్లిపోవడంవల్ల రక్తం లీకై చర్మం కందిపోతుందని, దాన్నే ఎకిమోసిస్ అంటారని, తాజా నివేదిక అదే చెబుతోందని పేర్కొంటున్నారు.
గట్టిగా కొట్టడం వల్లే పాదాలను, దాని చుట్టుపక్కలా ఎక్కడ ముట్టుకున్నా నొప్పి వంటి బాధలుంటాయని తెలిపారు. ప్రస్తుతం రిపోర్టులో ఉన్నవన్నీ గాయాల వల్ల వచ్చినవేనని చెప్పకనే చెప్పినట్లయిందని పేర్కొంటున్నారు. ఆయన్ను ఎవరైనా కొట్టారా? లేదా? అన్నది పోలీసు విచారణలో తేలాలని.. ఇది కేవలం వైద్య పరీక్ష కాబట్టి ఆర్మీ డాక్టర్లు అంతవరకే పరిమితమైనట్లు నిపుణులు వివరించారు” అని రాసుకొచ్చారు.
ఈనాడు పత్రిక తెలుసుకోవాల్సింది ఏంటంటే …ఆ కేవలం వైద్య పరీక్ష ఆధారంగానే సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ ఇచ్చింది. అలాగే కేవలం ఆ వైద్య పరీక్ష వెల్లడిం చిన నివేదికలోని సారాంశాన్నిబట్టే రఘురామకృష్ణంరాజును కొట్టినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారని ఈనాడు తీర్పు రాసింది.
రఘురామకృష్ణంరాజుకు గాయాలైనట్టు నిర్ధారణ కావాలని, ఆ తర్వాత ఏపీ సీఐడీ అధికారులపై చర్యలు తీసుకుంటారని చంద్రబాబుతో పాటు మరి కొందరు మీడియాధిపతులు ఎంతో ఆశించారు. అవేమీ జరగకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు కనిపిస్తోంది. దీంతో తామే తుది తీర్పులిస్తూ కథనాలు రాయడం వారికే చెల్లింది. మరి ఏపీ సీఐడీ అధికారులకు శిక్ష ఏంటో ఈనాడు మీడియా కోర్టే తేల్చేస్తే సరిపోతుంది.