గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్‌లో వివాదాస్పద డాక్టర్‌గా గుర్తింపు పొందిన మత్తు వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ (52) నిన్న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన బతికి ఉన్నప్పుడు రాజకీయ స్వార్థం కోసం ప్రధాన ప్రతిపక్షం వాడుకుందని ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఆరోపించేది. కానీ ఆయన చనిపోయినా …అదే స్వార్థ చింతనతో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీసింది.
గత ఏడాది విశాఖపట్నం నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో డాక్టర్ సుధాకర్ గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆయన సర్వీస్ నిబంధనలను అతిక్రమించి విమర్శించారనే కారణంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత విశాఖలో నడిరోడ్డుపై డాక్టర్ సుధాకర్ హల్‌చల్ చేస్తూ, అధికారులపై నోరు పారేసుకున్నారు.
ఆయన చేతులను వెనక్కి విరిచి అరెస్ట్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై భౌతికదాడికి సంబంధించి సీబీఐ విచారణకు కూడా హైకోర్టు ఆదేశించడం అప్పట్లో సంచలనం కలిగించింది. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి బాగాలేదని కొన్ని రోజులు విశాఖలోని మానసిక ఆస్పత్రిలో చికిత్స కూడా అందించారు.
ఇంత వరకూ ఆయన్ను విధుల్లోకి తీసుకోలేదు. అలాగే సీబీఐ విచారించి తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇంకా సీబీఐ విచారణపై తీర్పు రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలోని సీతమ్మధారలో సొంత ఇంటిలో ఆయన గుండెపోటుకు గురై మృతి చెందారు. అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యాయి. డాక్టర్ సుధాకర్ మృతిని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు ప్రత్యర్థుల నుంచి వస్తున్నాయి.
సీఎం జగన్ అనుసరిస్తున్న ఎస్సీ వ్యతిరేక చర్యలకు ఓ వైద్యుడు బలయ్యారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వం కక్ష సాధించడం వల్లే డాక్టర్ సుధాకర్ చనిపోయారని బాబు ఆరోపించారు. మాస్కులు అడిగిన పాపానికి శారీరకంగా, మానసికంగా వేధించి జగన్ ప్రభుత్వం ఆయన్ను చంపిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సుధాకర్ కుటుంబానికి కోటి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
డాక్టర్ సుధాకర్ కుటుంబంపై అంత ప్రేమే ఉంటే ఏదైనా సాయం చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సబబుగా ఉంటుందని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. ఎంత సేపూ తన స్వార్థానికి అందరినీ వాడుకోవడమే తప్ప, తాను మాత్రం ఉపయోగపడాలనే ఆలోచన చేయరని బాబుపై విమర్శలొస్తున్నాయి.