తన అంత్యక్రియలు ఎక్కడ జరగాలనే విషయంపై బతికున్నప్పుడే రాకేష్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హైదరాబాద్ బోరబండలో రాకేష్ మాస్టర్ మామగారి సమాధి ఉంది. అక్కడే ఓ వేప చెట్టు పెంచుతూ వచ్చారు రాకేష్. తను చనిపోయిన తర్వాత ఆ చెట్టు కిందే సమాధి చేయాలని ఆయన కోరారు.
ఆయన కోరిక మేరకు రాకేష్ మాస్టర్ కొడుకు చైతన్య, తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఆయన కుటుంబసభ్యులు, కొంతమంది అభిమానులు ఆయనకు తుదివీడ్కోలు పలికారు. వెయ్యికి పైగా పాటలకు కొరియోగ్రఫీ అందించి, ఎంతోమంది డాన్సర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాకేష్ మాస్టర్ మృతిపై టాలీవుడ్ ప్రముఖులు పెద్దగా స్పందించలేదు. దీనిపై చర్చ సాగుతోంది.
రాకేష్ మాస్టర్ శిష్యుడు శేఖర్ మాస్టర్, తన గురువును చివరి చూపు చూశాడు. రాకేష్ మాస్టర్ పార్థికదేహాన్ని చూసి చలించిపోయాడు. రాకేష్ మాస్టర్ చాలా సందర్భాల్లో శేఖర్ ను విమర్శించారు. ఓ దశలో శేఖర్ పై విరుచుకుపడ్డారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ అవేవీ మనసులో పెట్టుకోకుండా, గురువును కడసారి చూసేందుకు వచ్చాడు శేఖర్ మాస్టర్.
రాకేష్ మాస్టర్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది కరాటే కల్యాణి. ఈ సందర్భంగా ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రోలర్స్, మీమర్స్ వల్లనే రాకేష్ మాస్టర్ చనిపోయారని ఆరోపించింది.
“ట్రోలర్స్ ఎంతో ట్రోల్స్ చేశారు. ఆయన్ని మీమ్స్ లా వాడేశారు. ఆయన ఎంత మంచి చేశారో చాలామందికి తెలీదు. ఆయన జీవితం ఎలా నాశనం అయిందో చాలామందికి తెలీదు. ప్రతిసారి ఆయన్ను ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. ఓ మంచి మనిషి, మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ, మద్యానికి బానిసయ్యేలా చేసింది మన సమాజమే.”
ఇకనైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని, రాకేష్ మాస్టర్ లాంటి మంచి మనిషిని ట్రోల్ చేస్తే ఏమౌతుందో తెలుసుకోవాలని కోరారు కరాటే కల్యాణి. ట్రోల్స్ వల్ల రాకేష్ మాస్టర్ మానసికంగా కుంగిపోయారని, అందుకే మద్యానికి బానిసై తన జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు కల్యాణి.