ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి వంటి కీలక మైన శాఖలు చేతిలో ఉన్నాయి. ఆయనే బూడి ముత్యాలనాయుడు. ఆయన సర్పంచ్ నుంచి తన రాజకీయ జీవితం మొదలెట్టి 2014, 2019లలో వైసీపీ నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలో మాడుగుల నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. రెండవ విడత మంత్రి వర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవిని కొట్టేసారు.
ఉత్తరాంధ్రా జిల్లాల టీడీపీలో దశాబ్దాల పాటు పనిచేసిన వారికి సైతం దక్కని డిప్యూటీ సీఎం పదవి బూడికి దక్కిందంటే జగన్ చలువే అంటారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నూటిని నూరు శాతం విజయవంతం చేయడానికి కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
తెల్లారుతూనే మ్యాప్ పట్టుకుని మరీ తిరగని గ్రామల వెంట పరుగులు పెడుతూ తన నియోజకవర్గంలో మొత్తం అన్ని గ్రామాలను కవర్ చేస్తున్నారు. నాలుగు నెలల పాటు మండుటెండలు కాసినా వాటిని సైతం ఖాతరు చేయకుండా బూడి ప్రతీ గడప తొక్కారు. ఇపుడు బోరున వాన కురుస్తున్నా ఆయన కార్యక్రమాలు ఆపడంలేదు.
నేరుగా ప్రజలకు కలుసుకుంటూ వారి సమస్యలు తీరుస్తూ బూడి ఏ ఒక్క గడప మిస్ కాకుండా చూసుకుంటున్నారు. ఆయన్ని చూసిన వారు ఏమి ఓపిక స్వామీ నీకు అంటున్నారు. ఒకనాటి టీడీపీ కంచుకోట అయిన మాడుగులను మళ్ళీ దక్కించుకుని హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలుస్తాను అంటున్నారు బూడి. ఆయన మంత్రిగా అధికారికంగా పని ఉంటే విజయవాడ లేకపోతే తన సొంత నియోజకవర్గంలోనే ఉంటున్నారు.
ఈ రోజుకీ టీడీపీ బూడికి సరైన పోటీ ఇవ్వలేకపోతోంది అంటే అంతలా బూడి మాడుగులను వైసీపీకి కంచుకోట చేసేశారు అని అంటున్నారు.