తను సింగిల్ కాదని, తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇదివరకే వెల్లడించింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఆమె డేటింగ్ లో ఉంది. ఎప్పుడైతే రకుల్ తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టిందో, ఇక అప్పట్నుంచి ఆమె పెళ్లిపై దశలవారీగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ముగిసేలోపు ఆమె పెళ్లి చేసుకోబోతోందనేది తాజా రూమర్. దీనిపై రకుల్ స్పందించింది.
“పెళ్లి అనేది నా మనసులో లేదు. ప్రస్తుతం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడు జరుగుతుంది. ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, ఆ విషయాన్ని అందరికీ చెప్పి చేసుకుంటాను. ఇందులో దాపరికం లేదు. ప్రస్తుతానికైతే నా దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉంది.”
ఇలా తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండించింది రకుల్. పుకార్లన్నీ తన దృష్టికి వస్తాయని, స్పందించాలనుకుంటే స్పందిస్తానని లేకపోతే వాటిని అలా వదిలేస్తానని అంటోంది ఈ స్లిమ్ బ్యూటీ.
“ఏది వినాలనుకుంటానో అవి మాత్రమే వింటాను. నాకు సంబంధం లేని విషయాలు నాపై ప్రభావం చూపించడం నాకు ఇష్టం ఉండదు. అందుకే కొన్నింటిపై మాత్రమే స్పందిస్తాను. నా వ్యక్తిగత విషయాల్ని కూడా నా ఇష్టపూర్వకంగానే బయటపెట్టాను తప్ప, ఏవో పుకార్లు వచ్చాయని బయటపెట్టలేదు.”
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డాక్టర్-జి అనే హిందీ సినిమా షూటింగ్ పూర్తిచేసింది. మరో బాలీవుడ్ మూవీ ఛత్రీవాలీ షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇక సౌత్ లో ఆమె చేయాల్సిన ఇండియన్-2 సినిమా లేట్ అవుతూ వస్తోంది.