రామ్ చరణ్..లీడ్ హీరో

రామ్ చరణ్..లీడ్ హీరో అంటే ఏ సినిమాలో అని అంటారేమో? కాదు..కాదు. హీరో నిజంగా హీరోలా ఎప్పుడు కనిపిస్తాడు. ఒక పాజిటివ్ వైబ్ తో పబ్లిక్ లైఫ్ లో వుంటూ వుంటేనే కదా? తన…

రామ్ చరణ్..లీడ్ హీరో అంటే ఏ సినిమాలో అని అంటారేమో? కాదు..కాదు. హీరో నిజంగా హీరోలా ఎప్పుడు కనిపిస్తాడు. ఒక పాజిటివ్ వైబ్ తో పబ్లిక్ లైఫ్ లో వుంటూ వుంటేనే కదా? తన ప్రయివేట్ లైఫ్ తను బతికేస్తూ, తన ఫొటొలతో, వీడియోలతో ఇన్ స్టా గ్రామ్ ను నింపేస్తే సరిపోతుందా? కాదు కదా? తెలుగు హీరోలు ఎందుకో పబ్లిక్ లైఫ్ కు కాస్త దూరంగా వుండాలనుకుంటూ వుంటారు. సినిమా విడుదల టైమ్ లో హడావుడి చేస్తారు. ఫ్యాన్స్ ను కలుస్తారు.. మీడియాను కలుస్తారు తప్ప, పబ్లిక్ లైఫ్ లో కనిపించడం కష్టం. తమ వాళ్లు ఎవరైనా ఫంక్షన్ కు పిలిస్తే తప్పదు లేదంటే లేదు.

కానీ ఈ విషయంలో రామ్ చరణ్ డిఫరెంట్ గా అచ్చంగా హీరోలా కనిపిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ పబ్లిక్ లైఫ్ మరీ పెరిగింది. ఆర్ఆర్ఆర్ విడుదలయిన తరువాత ముంబాయిలో రామ్ చరణ్ హడావుడి మామూలుగా కనిపించలేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎందుకనో ఈ విషయంలో వెనుకబడ్డారు. అది వేరే సంగతి. ఆ కంపారిజిన్ అనవసరం కూడా.

రామ్ చరణ్, సింప్లిసిటీ, సదా నవ్వుతూ వుండడం, ఎవరి దగ్గర అయినా తన ఎంత వరకు కనిపించాలో అంత వరకే కనిపించడం వంటివి అతగాడిని వైవిధ్యంగా వుండేలా చేసాయి. ముఖ్యంగా అపోలో సంస్థతో సంబంధాలు కుదరుకున్నాక, రామ్ చరణ్ అవుటాఫ్ సినిమా సంబంధాలు పెరిగినట్లు కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న ఫార్ములా ఈ రేస్ లో హేమా హేమీ పారిశ్రామిక వేత్తలతో రామ్ చరణ్ భుజం..భుజం కలిపి వున్న ఫొటొల్లో కూడా ఈ విభిన్నత క్లియర్ గా కనిపించింది. ఏడాదిలో సగం కాలం స్వామి మాలలో వుండే చరణ్, బడా పారిశ్రామిక వేత్తల సరసన, అదే ఆహార్యంతో చాలా పద్దతిగా కనిపించాడు. పెళ్లికి ముందు సదా నెగిటివ్ ఆటిట్యూడ్ తో సదా వార్తల్లో వుండే రామ్ చరణ్ కు, ఇప్పటి రామ్ చరణ్ కు చాలా తేడా కనిపిస్తోంది. ఇప్పుడు డౌన్ టు ఎర్త్ అన్నట్లు కనిపిస్తున్నాడు. బహుశా వయసు తెచ్చిన పరిణితి కూడా కావచ్చు.

కానీ ఇదే వయస్సుకు అటు ఇటు వున్న హీరోలు చాలా మంది పబ్లిక్ లో తమ మనోభావాలు దాచుకోలేకపోతున్నారు. పబ్లిక్ లో ఎలా వుండాలో తెలుసుకోలేకపోతున్నారు. మొత్తం మీద రామ్ చరణ్ ను చూస్తుంటే ఇదే దారిలో ముందుకు వెళ్తే ‘అందరి వాడు’ అనిపించుకునేలాగే వున్నాడు.