మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి తనంత తెలివైన నాయకుడు రాజకీయాల్లో లేరని ఓ ఫీలింగ్. అందుకే ఆయన ప్రత్యర్థులపై సెటైర్స్ విసురుతుంటారు. అయితే మాట్లాడే ముందు, తానీ విషయమే నోరు తెరవచ్చా? లేదా? అనే విచక్షణ ఆయనలో మచ్చుకునే ఉండదు. అందుకే ఆయన అభాసుపాలు అవుతుంటారు. తాజాగా యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ ఏపీ వైద్య రంగం గురించి నోరు జారారు.
దీంతో ఆయన్ను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఉతికి ఆరేస్తున్నారు. వైద్య రంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భ్రష్టు పట్టించారని ఆరోపించారు. నాడు-నేడు కింద వైద్య రంగాన్ని ఉద్ధరించినట్టు జగన్ బడాయి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. కనీస మౌలిక సదుపాయాలు కొరవడి ప్రభుత్వాస్పత్రులు నరకకూపాలుగా తయారయ్యాయని ఆయన ఘాటు విమర్శ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూదీ, సిరంజీ, జ్వరం బిళ్లలు కరువయ్యాయని తూర్పార పట్టారు.పేదలకు మెరుగైన వైద్యం కోసం తమ ప్రభుత్వం అమలు చేసిన 33 పథకాలను జగన్ మంగళం పాడారని విమర్శించారు.
వైద్య రంగంపై యనమల విమర్శలను తీసుకుని వైసీపీ సోషల్ ఆడుకుంటోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి దంత వైద్యాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రామకృష్ణుడూ… గతంలో దంత వైద్యం (రూట్ కెనాల్) కోసం సింగపూర్ వెళ్లి రూ.2.88 లక్షల ప్రజా సొమ్మును అప్పనంగా ఖర్చు చేసిన విషయం గుర్తు రాలేదా? అని దెప్పి పొడుస్తున్నారు. రూ.10 వేలలోపు అయ్యే దానికి… విదేశాలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు చేసేటప్పుడు తమరి పాలనలోని ప్రభుత్వ వైద్యం గుర్తు రాలేదా? అని వెటకరిస్తున్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ తమరి చేతల్లో ఉందని, ఇష్టానుసారం దుర్వినియోగం చేశారని, నాడు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఎందుకు గుర్తు రాలేదు సార్ అని నిలదీస్తున్నారు. వైద్యరంగం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కూడా లేదని గుర్తించుకుంటే మంచిదని హితవు చెబుతున్నారు.