తెలంగాణలో మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై చేసిన హాట్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు సమర్థించకపోగా, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలో శల్యసారథ్యం చేస్తూ, పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎంతో నయమని, తనకు నచ్చని పార్టీలో వుండనని కాంగ్రెస్‌ను వీడారని గుర్తు చేస్తున్నారు. కానీ వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లో వుంటూ, ఆ పార్టీకి పూడ్చుకోలేని డ్యామేజీ చేస్తున్నారనే ఆందోళన కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. గతంలో అనేక సందర్భాల్లో వెంకటరెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడే క్రమశిక్షణ చర్యలు తీసుకుని వుంటే, ఇవాళ ఈ దుస్థితి ఏర్పడేది కాదని ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే అంటున్నారు.
ఒకవైపు బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చేలా బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ పొత్తుపై సానుకూల కామెంట్స్‌ను వెంకటరెడ్డి చేశారని సీనియర్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో రానున్న రోజుల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఎవరికీ కూడా 60 సీట్లకు మించి రావని ఆయన తేల్చి చెప్పారు. తమతో కలిసి కేసీఆర్ నడవక తప్పదన్నారు. అందరం కష్టపడి తలా కొన్ని సీట్లు గెలిపిస్తే పార్టీకి 40-50 సీట్లు వస్తాయని ఆయన అనడం కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి గురైంది.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఒక్కసారిగా తమకు అనుకూలమైన కోణంలో విమర్శలకు పదును పెట్టారు. మరోవైపు కాంగ్రెస్‌కు తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్రకు దిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోమటిరెడ్డి వివాదాస్పద కామెంట్స్ చేయడంతో బీజేపీకి రాజకీయంగా ఆయుధం ఇచ్చినట్టైంది. మరోవైపు కాంగ్రెస్ ఆల్రెడీ మునిగిపోయిన నావ అని, తమను ముంచేలా ఎంపీ వెంకటరెడ్డి కామెంట్స్ చేయడం ఏంటని బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు.
మొత్తానికి కాంగ్రెస్‌లో వుంటూనే ఆ పార్టీకి నష్టపరిచే వ్యాఖ్యలు చేయడం వెనుక కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుద్దేశం ఏంటో అంతుచిక్కడం లేదని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు.