తాగి బండి నడపొద్దు అని పోలీసులు ఎంత మొత్తుకున్నా మందుబాబులు లెక్కచేయరు. మందేస్తారు, బండెక్కుతారు.. పోలీసులు బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేస్తే దొరికిపోతారు. ఇలా దొరికిపోయినవారందరికీ జరిమానా విధించడమో, లైసెన్స్ టెంపరరీగా రద్దు చేయడమో చేస్తుంటారు. కానీ కేరళ పోలీసులు ఓ వెరైటీ శిక్ష వేసి వారికి షాకిచ్చారు. జీవితంలో ఇక మందు తాగి బండి నడపం అంటూ వారిచేతే చెప్పించారు, ఒప్పించారు.
కేరళలోని కొచ్చిలో పోలీసులు ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న మందుబాబుల్ని పట్టుకున్నారు. వారందర్నీ పట్టుకుని త్రిపునితుర పోలీస్ స్టేషన్ కి తరలించారు. “మద్యం తాగి బండి నడపం” అని పేపర్ మీద రాసిచ్చేసి వెళ్లిపోండి అంటూ మందుబాబులకు చెప్పారు.
ఇదేదో బంపరాఫర్ లా ఉందంటూ మందు బాబులాంతా పేపర్, పెన్ను తీసుకుని అలాగే రాశారు, పెన్ను పట్టుకున్న తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబోమన్నారు. ఒకసారి కాదు, వెయ్యిసార్లు ఇంపోజిషన్ రాయండి అన్నారు పోలీసులు. దీనికంటే జరిమానా కట్టి వెళ్లిపోవడమే బెటర్ అనుకున్నారు. కానీ పోలీసులు కుదరదన్నారు, ఇంపోజిషన్ రాయాల్సిందేనన్నారు. చేసేదేం లేక చేతులు నొప్పి పెడుతున్నా ఇంపోజిషన్ రాసి ఇచ్చి ఇంటికెళ్లారు. ఈ దెబ్బతో తాగింది దిగడమే కాదు, ఇకపై తాగాలన్న ఆలోచన కూడా రావట్లేదంటున్నారు కొంతమంది.
ఆదివారం కొచ్చిలో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ బైకిస్ట్ చనిపోయాడు. ఈ వ్యవహారంపై హైకోర్టు పోలీసులను తీవ్రంగా మందలించడంతో వారంతా వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. వారందర్నీ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇలా ఇంపోజిషన్ రాయించారు.
ఈ వెరైటీ శిక్ష ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వందో ఐదొందలో పోలీసుల చేతిలో పెట్టి తప్పించుకోవచ్చు అనుకునేవారికి ఇలాంటి శిక్షలు కచ్చితంగా గుణపాఠంగా నిలుస్తాయని అంటున్నారు నెటిజన్లు.