హిట్ సినిమా పాటలు, మరో సినిమాకు టైటిల్ గా మారడం కొత్తేంకాదు. దశాబ్దాలుగా ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది. చివరికి 'ఊ అంటావా మామ, ఊఊ అంటావా' అనే సాంగ్ లిరిక్ తో కూడా ఓ సినిమా వచ్చేస్తోంది. ఇదే క్రమంలో మరో హిట్ సాంగ్, సినిమా టైటిల్ గా మారింది. ఆ హిట్ సాంగ్ బన్నీది కాగా.. ఆ టైటిల్ శ్రీవిష్ణు సినిమాది.
అల వైకుంఠపురములో సినిమాలో సామజవరగమన అనే లిరిక్స్ తో వచ్చిన సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడా లిరిక్ లో పదాన్ని తన కొత్త సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు నటుడు శ్రీవిష్ణు.
దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి శ్రీవిష్ణు హీరోగా హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై రాజేష్ దండా నిర్మాతలుగా కొత్త సినిమా వస్తోంది. అనిల్ సుంకర సమర్పిస్తున్న ఈ సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ నటిస్తోంది. ఈ సినిమాకు సామజవరగమన అనే టైటిల్ పెట్టారు.
అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీవిష్ణు రోల్ చాలా సరదాగా ఉంటుందంట. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.
గోపీసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.