బీజేపీలో ఆయన జాతీయ నాయకుడు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా తయారైంది ఆయన పరిస్థితి. కనీసం తన స్వస్థలం ప్రొద్దుటూరులో తన వార్డులో బీజేపీ తరపున పోటీ నిలపలేని దుస్థితి. కానీ ఆయన వైసీపీపై విమర్శలు వింటే… కోటలు దాటుతుంటాయి. ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా తన వంతుగా విజయవంతమైన పాత్రను పోషిస్తున్నారు. నిజం నిప్పులాంటిదంటారు.
బీజేపీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, మరోవైపు టీడీపీకి అనుకూల నాయకుడిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. తాజాగా ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. సత్యానికి ఉన్న లక్షణం ఇది. అయితే సత్య అని పేరు పెట్టుకున్నోళ్లంతా సత్యవంతులుగా ఉంటారని, ఉండాలని రూల్ లేదని తన చర్యలతో ఆ బీజేపీ నాయకుడు నిరూపిస్తుంటారు.
మార్చి 13న ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. ఏపీలో మూడు పట్టభద్రులు, రెండు టీచర్స్ ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ఇదే తెలంగాణ విషయానికి వస్తే… మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏవీ నారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది.
ఏపీలో మాత్రం రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని వెనుక ఓ నాయకుడి సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ నాయకుడెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, పార్టీని తొక్కేసి సొంత అభ్యర్థిని పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో నిలిపారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల అభ్యర్థిగా సన్నపరెడ్డి దయాకర్‌రెడ్డి, కడప, అనంతపురం, కర్నూలు అభ్యర్థిగా ఎన్.రాఘవేంద్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ పేర్లను నడ్డా ప్రకటించడం విశేషం.
ఈ నేపథ్యంలో కడప, అనంతపురం, కర్నూలు నియోజకవర్గం (పశ్చిమరాయలసీమ) టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి మద్దతుగా ఏపీలో టీడీపీ, ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుడిగా గుర్తింపు పొందిన సదరు “సత్య”వంతుడు ప్రచారం చేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదేదో బీజేపీ అభ్యర్థినే బరిలో దింపి, గెలిపించుకుంటే సరిపోయేది కదా అని బీజేపీ రాయలసీమ నేతలు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీని అడ్డుపెట్టుకుని ఆర్థికంగా, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన ఆ నాయకుడు… ఏపీలో మాత్రం అణచివేసేందుకు ప్రతి క్షణం పని చేస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నాయకుడి పార్టీ ధిక్కార వ్యవహారంపై అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.