గౌరవం ఇవ్వాలంటున్నారు …దిగజారి అడుక్కుంటున్నారు!

అనగనగా ఒకానొక కాలంలో ఎర్ర పార్టీలకు అదేనండి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు (సీపీఐ, సీపీఎం) ఘనమైన చరిత్ర ఉండేది. వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర ఉండేది. పేదసాదలకు అండగా నిలిచిన చరిత్ర ఉండేది. నియంత…

అనగనగా ఒకానొక కాలంలో ఎర్ర పార్టీలకు అదేనండి ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు (సీపీఐ, సీపీఎం) ఘనమైన చరిత్ర ఉండేది. వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర ఉండేది. పేదసాదలకు అండగా నిలిచిన చరిత్ర ఉండేది. నియంత పాలకులను ఎదిరించి ప్రశ్నించే, వారి దుమ్ముదులిపే చరిత్ర ఉండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, ప్రపంచ పరిణామాలు మారుతున్న కొద్దీ ముఖ్యంగా ప్రపంచీకరణ వేగం పుంజుకున్న తరువాత ఎర్ర పార్టీల వైభవం పోరాట చరిత్ర అంతరిస్తూ వచ్చింది. కాలదోషం పడుతూ వచ్చింది. ఎన్నికల్లో సొంతంగా పోరాడి నాలుగు సీట్లు సంపాదించుకోలేని దుస్థితి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీలకు చివరకు “తోక పార్టీలు” అనే ముద్ర పడింది.

దశాబ్దాల చరిత్ర ఉన్న ఎర్ర పార్టీలు నిన్న మొన్న పుట్టిన జూనియర్ పార్టీలను సీట్ల కోసం ఆడుకుంటున్నాయి. అయినప్పటికీ భేషజం మాత్రం వదులుకోవడంలేదు. తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు కేసీఆర్ కు దోస్తులుగా మారిపోయాయి. ఇప్పుడు ఆయనకు జై కొడుతున్నాయి. కొంతకాలం కిందట మునుగోడు ఉపఎన్నికలో కేసీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. వారు అనుకున్నట్లుగా బీజేపీ ఓడిపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేసీఆర్ పార్టీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. 

సీట్ల కోసం కేసీఆర్ తో బేరాలకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని సిపిఐ, సిపిఎం స్పష్టం చేస్తున్నాయి. తమకు గౌరవప్రదమైన సీట్లను కేటాయిస్తేనే పొత్తు ఉంటుందని, లేదంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించుకోవలసి వస్తుందని చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ తమ పార్టీలకు బలమున్న స్థానాలపైన చర్చించి ఆయా స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరే ఆలోచనలో ఉన్నారు ఎర్ర పార్టీల నాయకులు.

సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు చెరో పది సీట్లు అడగాలని, కనీసం చెరో ఐదు సీట్లు అయినా ఇచ్చేలా చూడాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలను కోరడంతో పాటు, రెండు ఎమ్మెల్సీ సీట్ల చొప్పున అయినా అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిపిఐ కొత్తగూడెం స్థానాన్ని, సిపిఎం భద్రాచలం స్థానాన్ని తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో పొత్తులు, సీట్ల కేటాయింపుకు సంబంధించి కొందరు బీఆర్ఎస్ నేతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి అసెంబ్లీ ఎన్నికలలో ఎటువంటి సీట్లు కేటాయించేది లేదని, చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సిపిఐ, సిపిఎం నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. 

ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే మాత్రం మళ్ళీ ఆలోచించుకోవాలని, లేదంటే తాము ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సి ఉంటుందంటూ లెఫ్ట్ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని, తమను తక్కువగా అంచనా వేస్తే బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందని అంటున్నారు. బిజెపికి చెక్ పెట్టాలంటే కనుక గౌరవప్రదమైన సీట్లు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే సమయంలో సిపిఐ ,సిపిఎం కూడా ఒకరికి ఒకరు పోటీగా అభ్యర్థులను నిలపొద్దని, పరస్పర ఐక్యతతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.