భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ మధ్య కాలంలో రాజకీయ జ్యోతిష్కుడుగా మారినట్లు కనిపిస్తోంది. మీడియా కనపడగానే వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేస్తున్నారు. గతంలో మునుగోడు ఉప ఎన్నిలకు రాజకీయ జ్యోసం చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని.. హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ తమతో కలవాల్సిందేనని జోస్యం చెప్పారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి 60 స్థానాలు మించి రావని.. కాంగ్రెస్ సీనియర్లు అందరూ కలిస్తే కాంగ్రెస్‌కు 40 నుండి 50 సీట్లు వస్తాయని, ఏదైనా మిరాకిల్ జరిగేతే తప్ప కాంగ్రెస్‌కు అంతకు మించిన మెజార్టీ రాదన్నారు. కొత్త ఇంచార్జ్ గా మాణిక్ ఠాక్రే వచ్చాక పార్టీలో అంతా బాగుందని, తాను వచ్చే నెల ఒకటో తేదీ యాదగిరి గుట్ట నుంచి నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నట్లు ప్రకటించారు.
నాయకులు అందరూ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని పాదయాత్రలు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ బలంగా ఉందని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు .. తాను స్టార్ క్యాంపెయినర్ ను కాబట్టి ఒక్క జిల్లాకే పరిమితం కాకుండా అధిష్టానం అనుమతితో రాష్ట్రం మొత్తం బస్సు యాత్ర లేదా మోటార్ సైకిల్ యాత్ర చేస్తానంటూ ప్రకటించారు.
ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో ప్రజల్లో ఉన్నారు. వచ్చే నెల నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెలుతుండడం కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు.