హీరో రామ్ కి కులపోటు

తలపోటు వస్తే మందులతో తగ్గిపోతుంది కానీ, ఈ కులపోటు ఓ పట్టాన వదిలిపెట్టదు. అలాంటి కులపోటుని అనవసరంగా తగిలించుకున్నాడు హీరో రామ్. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టైంది ఇప్పుడీ హీరో పరిస్థితి. రమేష్ హాస్పిటల్స్ కి మద్దతుగా…

తలపోటు వస్తే మందులతో తగ్గిపోతుంది కానీ, ఈ కులపోటు ఓ పట్టాన వదిలిపెట్టదు. అలాంటి కులపోటుని అనవసరంగా తగిలించుకున్నాడు హీరో రామ్. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్టైంది ఇప్పుడీ హీరో పరిస్థితి. రమేష్ హాస్పిటల్స్ కి మద్దతుగా వేసిన ట్వీట్.. తదనంతర పరిణామాలు, ఫైనల్ గా రామ్ కి మద్దతుగా కదిలొచ్చిన చంద్రబాబు.. ఈ వ్యవహారాలన్నీ రామ్ ని పూర్తిగా కార్నర్ చేశాయి.

రామ్ ఫలానా కులానికి చెందిన వ్యక్తి, అందుకే ఆయనకు ఫలానా కులానికి చెందిన నాయకుడు మద్దతుగా మాట్లాడారంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది. గతంలో రామ్-చంద్రబాబు కలిసిన ఫొటోల్ని కూడా మళ్లీ తిరగదోడుతున్నారు.

ఇప్పటివరకూ ఇండస్ట్రీలో రామ్ కి కామ్ గోయింగ్ అనే ఇమేజ్ ఉంది. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లలేదు, ఎవర్నీ కెలకలేదు. కానీ తొలిసారిగా రమేష్ హాస్పిటల్స్ కి మద్దతు తెలుపుతూ ఆయన వేసిన ట్వీట్స్ ఆ ఇమేజ్ ని చెరిపేశాయి. దీంతో ఇరకాటంలో పడ్డ రామ్.. తనకొచ్చిన కులపోటుని తగ్గించుకోడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.

సామాజిక బాధ్యతగా కరోనా పట్ల మెసేజ్ లు పెడుతున్న రామ్.. తాజాగా కులగజ్జి అనే అంశంపై నెటిజన్లకు క్లాస్ తీసుకున్నారు. “నా ప్రియమైన సోదర సోదరీమణులారా.. కులం అనే ఒక పెద్ద వ్యాధి కరోనా కంటే ఎక్కువ వేగంగా ప్రబలుతోంది. ఇది దానికంటే బాగా డేంజర్. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పక్కనవాళ్లు మనల్ని ఈ వ్యాధి దగ్గరకు నెట్టాలని చూసినా జాగ్రత్తగా ఉండాలి”. ఇదీ రామ్ వేసిన ట్వీట్ సారాంశం.

అసలిలాంటి ట్వీట్లు పెట్టుకోవాల్సిన అగత్యం రామ్ కి ఏంటి? కులం అనే వ్యాధి గురించి ఇంత లెక్చర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? తనపై పడిన బురదను కడుక్కునేందుకు రామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఈ ఒక్క ట్వీట్ తో అర్థమౌతోంది. చేతులు పూర్తిగా కాలకముందే రామ్ ఆకులు పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నాడన్న మాట.

సినిమా వాళ్లకు ఒక కులం, ఒక వర్గం అంటూ ఎవరూ ఉండరు. ప్రేక్షకులందరూ కలిస్తేనే అభిమానులు, వారితోనే సినిమాకు కలెక్షన్లు, పేరు ప్రతిష్టలు. ఆ విషయం గ్రహించాడు కాబట్టే రామ్ నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. ఇలాంటి ఆటో ట్వీట్లు ఎన్ని వేసినా, ఇప్పటికిప్పుడు రామ్ పోతినేని.. రామ్ ఓన్లీ.. గా మారలేరనేది మాత్రం వాస్తవం.

హైద్రాబాదులో నీ ఘనకార్యాలు అవేనా

ఆర్‌కే రాత‌ల‌కు అర్థాలే వేరులే