Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీకు మీరే.. మాకు మేమే.. ఆర్ఆర్ఆర్ లో చీలిక?

మీకు మీరే.. మాకు మేమే.. ఆర్ఆర్ఆర్ లో చీలిక?

ఆస్కార్ అవార్డ్ కోసం లైజనింగ్ స్టార్ట్ చేసిన క్షణం నుంచే ఆర్ఆర్ఆర్ లో రెండు వర్గాలు మొదలయ్యాయి. ముందుగా రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ యూఎస్ఏ వెళ్లాడు. హాలీవుడ్ మీడియాలో ఓ వెలుగు వెలిగాడు. ఆ తర్వాత రామ్ చరణ్ వెళ్లాడు. ఈసారి ఇంకాస్త గట్టిగా తనకు తాను సొంత ప్రచారం చేసుకున్నాడు.

నిజానికి చరణ్ వెళ్లినప్పుడు రాజమౌళి టీమ్ కంటే, చరణ్ సొంత పీఆర్ టీం ఎక్కువ వర్క్ చేసింది. ఎన్టీఆర్ కు రాజమౌళి అండ్ కో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శల మధ్య.. స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి పీఆర్ మొత్తాన్ని సెట్ చేశారు.

పైగా చరణ్ తో గతంలో ఓ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా అక్కడుంది. దీంతో ఆమె సహకారంతో చరణ్ కు మరింత గట్టిగా ప్రచారం చేసిపెట్టారు. ఎక్కువమంది హాలీవుడ్ ప్రముఖుల్ని కలిపించే ఏర్పాటుచేసింది ప్రియాంక. పనిలోపనిగా సూపర్ హిట్ హాలీవుడ్ కార్యక్రమాలకు కూడా చరణ్ ను సిఫార్స్ చేసింది.

ఇదంతా చరణ్ పీఆర్ టీమ్, ప్రియాంక చోప్రా చొరవతోనే సాధ్యమైందనేది ఓపెన్ సీక్రెట్. అదే టైమ్ లో 'గ్లోబల్ స్టార్' ఎవరనే వివాదాస్పద చర్చ కూడా సోషల్ మీడియాలో ఊపందుకుంది. చరణ్ ను అతడి పీఆర్ టీమ్ మొత్తం గ్లోబల్ స్టార్ గా ప్రమోట్ చేయడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ హంగామా షురూ..

ఇదంతా ఆస్కార్ అవార్డ్ రాకముందు సంగతి. ఆస్కార్ అవార్డ్ వచ్చిన తర్వాత, ఆ క్రెడిట్ ను తమ ఫిల్మోగ్రఫీకి ఆపాదించుకునేందుకు ఇద్దరు హీరోలు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. అతడి కోసం అతడి పీఆర్ టీమ్ మొత్తం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ పేరిట టీ-షర్టులు తయారుచేసింది. జై ఎన్టీఆర్ అంటూ జెండాలు తయారు చేయించింది. ప్రత్యేకంగా కొన్ని అభిమాను సంఘాల్ని ఏర్పాటుచేయించింది.

ఎన్టీఆర్ ల్యాండ్ అవ్వగానే హంగామా ఓ రేంజ్ లో చేసింది. ఎయిర్ పోర్ట్ నుంచి సిటీలోకి ఎంటరయ్యేంత వరకు కార్లతో ర్యాలీ ఏర్పాటుచేసింది. ఇక మీడియా హడావుడి సరేసరి. ఇలా ఆస్కార్ అవార్డ్ ప్రకటన తర్వాత 'ఎన్టీఆర్ హైదరాబాద్ ఎంట్రీ'ని ఆస్కార్ కు లింక్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా చేసింది పీఆర్ టీమ్.

ఇప్పుడు రాజమౌళి కుటుంబం వంతు..

ఎన్టీఆర్ తర్వాత రాజమౌళి కుటుంబం దిగింది. హైదరాబాద్ లో ల్యాండ్ అయిన రాజమౌళి అండ్ కో కు ఘనస్వాగతం దక్కింది. జై జక్కన్న అనే నినాదాలు ఎయిర్ పోర్టులో మారుమోగిపోయాయి. ఈ కుటుంబ సభ్యులంతా జయజయధ్వానాల మధ్య తమ ఇళ్లకు చేరుకున్నారు.

ఇప్పుడు రామ్ చరణ్ వంతు..

ఇక మిగిలింది రామ్ చరణ్ మాత్రమే. ప్రస్తుతానికి రామ్ చరణ్ హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వలేదు. అతడు ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఇండియా టుడే కాన్ క్లేవ్ లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నాడు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కూడా అవ్వబోతున్నాడు.

చరణ్ కు ఢిల్లీలో ఘనస్వాగతం లభించింది. చరణ్ కోసం బాలీవుడ్ మీడియా మొత్తాన్ని ఎయిర్ పోర్ట్ లో మొహరించారు. ప్రస్తుతం బాలీవుడ్ మీడియా అంతా గ్లోబల్ స్టార్, రామ్ చరణ్, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అనే 3 పదాల చుట్టూ తిరుగుతోంది. ఇక హైదరాబాద్ ల్యాండింగ్ కోసం మరిన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తమ్మీద ఆస్కార్ అవార్డు ఇద్దరు హీరోల మధ్య కాస్త దూరం పెంచినట్టే కనిపిస్తోంది. ఓవైపు పరిస్థితులు ఇలా ఉంటే, మరోవైపు ఆర్ఆర్ఆర్ కు పార్ట్-2 తీస్తానంటూ రాజమౌళి ప్రకటించడం కొసమెరుపు. ఈ సంగతి పక్కనపెడితే, ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తేనే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటే, రాబోయే రోజుల్లో మరో ఇద్దరు స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయగలరా అనే చర్చ కూడా మొదలైంది. 

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా