రావు రమేష్ సోలోగా..

చిన్న సినిమా లేదా కొత్త సినిమా లేదా కొత్త ప్రయత్నం జనాలకు చేరువ కావాలంటే రొటీన్ పబ్లిసిటీ పనికిరాదు. రావు రమేష్ మెయిన్ లీడ్ గా సినిమా అంటే సమ్ థింగ్ కొత్త. మరి…

చిన్న సినిమా లేదా కొత్త సినిమా లేదా కొత్త ప్రయత్నం జనాలకు చేరువ కావాలంటే రొటీన్ పబ్లిసిటీ పనికిరాదు. రావు రమేష్ మెయిన్ లీడ్ గా సినిమా అంటే సమ్ థింగ్ కొత్త. మరి అలాంటి సినిమాను ముందు నుంచీ జనానికి చేరువ చేసే ప్రయత్నం చేయాలంటే కొత్తగా ఏదో చేయాలి. అదే చేసారు ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమా మేకర్లు. ఈ సినిమా లో కీలక పాత్ర రావు రమేష్ దే. ఆ విషయం చెప్పడానికి, టైటిల్ పోస్టర్ విడుదలకు రావు రమేష్ గతంలో చేసిన రెండు పాత్రలను గెస్ట్ లుగా తీసుకువచ్చారు.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, కెజిఎఫ్ 2 సినిమాల్లో రావు రమేష్ పాత్రలు వచ్చి, రియల్ రావు రమేష్ ను నిలదీయడం, ఫుల్ మీల్స్ లాంటి ఫుల్ కామెడీ సినిమా తీయమని అడగడం అన్నది ఐడియాగా ప్లాన్ చేసారు. అంతే కాదు, పోస్టర్ ను క్యూఆర్ కోడ్ ద్వారా బయటపెట్టడం అన్నది కూడా కొత్తగా వుంది.

ప్రతి వారి చేతిలో స్మార్ట్ ఫోన్..కోడ్ స్కానర్ వుంటున్నాయి కనుక జనానికి బాగానే రీచ్ అవుతుంది. సినిమాలో రావురమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీబీఆర్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా రూపొందుతోంది. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్ష్మణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు.

సినిమా గురించి రావు రమేష్ మాట్లాడుతూ ''మారుతి నగర్ సుబ్రహ్మణ్యం… ఈ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది. అయితే, ఈ సినిమా పోస్టర్ ఎవరు ఆవిష్కరిస్తే బావుంటుందని అనుకున్నా. నటుడిగా నాకు ఈ స్థాయిని, ఈ స్థానాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులే ఆవిష్కరిస్తే బావుంటుందని మేమంతా మనస్ఫూర్తిగా నమ్మాం. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే… వీడియో చివర్లో వచ్చే క్యూఆర్ కోడ్ ని మీ చేతులతో స్కాన్ చేయండి. నా పోస్టర్ ఆవిష్కరించండి, ప్రోత్సహించండి'' అని విజ్ఞప్తి చేశారు.