కూటమిని గెలిపించే బాధ్యత మోడీదేనట

ఏపీలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి దాసోహమనడమే కాకుండా కూటమిని గెలిపించే బాధ్యత కూడా ఆయన మీదనే పెట్టారట. నీవే దిక్కని నమ్మితిమి అని భక్త రామదాసు మాదిరిగా పాట పాడుతున్నారు. కానీ…

ఏపీలో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ బీజేపీకి దాసోహమనడమే కాకుండా కూటమిని గెలిపించే బాధ్యత కూడా ఆయన మీదనే పెట్టారట. నీవే దిక్కని నమ్మితిమి అని భక్త రామదాసు మాదిరిగా పాట పాడుతున్నారు. కానీ ఏపీలో బీజేపీ, మోడీ ప్రభావం అంతగా ఉంటుందా అనేది సందేహమేనని అంటున్నారు పరిశీలకులు.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం ఏపీ పట్ల వ్యవహరించిన తీరును పరిశీలించినవారికి ఇలాంటి సందేహం కలగడం సహజమే. కానీ బాబుకు, పవన్ కు ఎలాంటి సందేహాలు లేనట్లుగా కనబడుతోంది.  బీజేపీతో టీడీపీ-జ‌న‌సేన పొత్తులు ఖ‌రారైన అయింది కదా. ఇక ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల‌పై దృష్టి పెట్టారు.

ప్ర‌ధానంగా న‌రేంద్ర మోడీని ఏపీకి తీసుకురావ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను పొత్తుల పార్టీవైపు న‌డిపించేందుకు అవ‌కాశం ఉంటుంద‌నే అంచ‌నాలు వేసుకున్నారు.  మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఈ నెల 17న లేదా 18న భారీ బహిరంగ సభను టీడీపీ-జనసేన నిర్వహించబోతోంది.

ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీనే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తారని చెబుతున్నారు. వైసీపీని ఓడించేందుకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కూటమిగా ఏర్ప‌డ‌డ‌మే కాదు గెలిపించే బాధ్య‌త కూడా మోడీ పైనే పెట్టింది టీడీపీ కూట‌మి. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ  ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్తుండడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించాల్సి ఉంది.

ఆ బాధ్యతను ప్రధాని మోదీకే అప్పగించారు. రాష్ట్రానికి సంబంధించి ఒకటి రెండు కీలక ప్రకటనల్ని మోదీతో  చేయించడం ద్వారా కూటమిపై విశ్వాసం కలుగుతుందనేది ఆ పార్టీల ప్లాన్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా బహిరంగసభకు ప్లాన్ వేశాయి. అయితే ఇప్పుడు మోదీ కూడా వస్తుండడంతో సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తారా.. లేకుంటే మరో ప్రాంతాన్ని ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది.  

సరే …సభ ఎక్కడ నిర్వహించినా మొత్తానికి ఆ సభలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను మోదీ వెల్లడిస్తారని సమాచారం. బీజేపీ పొత్తుకు ఓకే చెప్పగానే  టీడీపీ, జనసేన ఫుల్ హ్యాపీ. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో కేంద్రంలో  అధికారంలో  ఉన్న బీజేపీ అంత గొప్పగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిలో ఇంతవరకూ వాటాలు తేల్చలేదు. పోలవరం పూర్తి కాలేదు. రైల్వే జోన్ సాకారం కాలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మెడపైన వేలాడుతోంది.  ప్రధానంగా ప్రత్యేక హోదాకు పంగనామం పెట్టారు. ఇలా అనేక అంశాలపై మోడీ  స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.

ప్ర‌ధాని ఏపీకి వ‌స్తే.. ఎలాంటి హామీలు ఇస్తారు? అనేది ఆస‌క్తిగా మారింది. రాష్ట్రానికి మేలు జరిగేలా కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఆ ప్రకటనలు ఓటర్లను కట్టిపడేసేలా.. కూటమికే ఓట్లు పడేలా ఉంటాయని టీడీపీ అండ్ జనసేన నాయకులు, బీజేపీ లీడర్లు చెబుతున్నారు.

ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ గురించి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఏమేం మాట్లాడుతారో అనేదానిపై కూడా పార్టీల‌కు, రాజ‌కీయాల‌కు అతీతంగా సర్వత్రా చ‌ర్చ సాగుతోంది. బీజేపీతో జతకట్టి ఎన్డీయేలో చేరడం ద్వారా తమ బలం పెరుగుతుందని తెలుగుదేశం, జనసేనలు భావిస్తున్నాయి.

కానీ, ఇది వారి బలహీనతని చెప్పకనే చెబుతోందని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్డీయేతో జతకట్టడం ద్వారా చంద్రబాబు, పవన్‌లు సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నట్లు అయిందని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఎలాంటి ప్రభావిత పాత్రను పోషించే అవకాశం ఇప్పటికీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది.

ఈ ఐదేళ్ళలో ఆ పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. బీజేపీ జాతీయ పార్టీయే కావచ్చు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో దాని ఉనికి శూన్యం. తెలంగాణలోనైనా బీజేపీ గత పదేళ్ళ కాలంలో పుంజుకుంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అడుగు ముందుకు వేసింది లేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు టీడీపీకి, జనసేనకు లాభించకపోగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు బాబు, పవన్‌ల కూటమికి దూరంగా జరుగుతారని అంటున్నారు. బీజేపీతో  పొత్తును టీడీపీ, జనసేనల అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్‌ ఓటర్లు పూర్తిగా టీడీపీని పక్కన పెడతారు. ఇప్పటికే ఈ రెండు వర్గాలవారిలో అధికభాగం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా వున్నారు. తటస్థంగా వున్నవారు ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు ఇచ్చే అవకాశముంది.

మత రాజకీయాలకు పాల్పడే బీజేపీతో జతకట్టిన వారిని ఈ వర్గాలు క్షమించే అవకాశం లేదు. కనుక ఈ వర్గాలకు చెందిన ఓటర్లంతా ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌కు ఇప్పటివరకు  మద్దతు ఇస్తున్న వామపక్షాలు వారికి దూరంగా జరగకతప్పదు.

బీజేపీతో జతకట్టిన బాబు, పవన్‌లతో తెగదెంపులు చేసుకోడం సీపీఐ, సీపీఎం పార్టీలకు అనివార్యం. ఈ పరిస్థితిలో కేంద్రంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వామపక్షాలు బాబు, పవన్‌లకు ఓటు వేయాల్సిందిగా చెప్పలేవు. ఇలాంటి పరిస్థితిలో మోడీ ప్రభావం ఏపీలో ఎంత మేరకు ఉంటుందో చూడాలి.