జ‌న‌సైనికుల అస్త్ర స‌న్యాసం!

అస‌లే త‌క్కువ సీట్లు ద‌క్కాయ‌ని తీవ్ర నిరాశ‌లో ఉన్న జ‌న సైనికుల‌పై మ‌రో పిడుగుపాటు. బీజేపీతో పొత్తు ఖ‌రారైన నేప‌థ్యంలో జ‌న‌సేన సీట్ల‌లో కోత‌. దీంతో జ‌న‌సైనికులు త‌లెత్తుకోలేని ద‌య‌నీయ స్థితి. శ‌త్రువుల‌కు కూడా…

అస‌లే త‌క్కువ సీట్లు ద‌క్కాయ‌ని తీవ్ర నిరాశ‌లో ఉన్న జ‌న సైనికుల‌పై మ‌రో పిడుగుపాటు. బీజేపీతో పొత్తు ఖ‌రారైన నేప‌థ్యంలో జ‌న‌సేన సీట్ల‌లో కోత‌. దీంతో జ‌న‌సైనికులు త‌లెత్తుకోలేని ద‌య‌నీయ స్థితి. శ‌త్రువుల‌కు కూడా జ‌న సైనికుల ఆవేద‌న రాకూడ‌ద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

కూట‌మిలోని మూడు పార్టీల సీట్ల‌పై చంద్ర‌బాబునాయుడు నివాసంలో సోమ‌వారం సుదీర్ఘ చ‌ర్చ‌ల అనంత‌రం స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా జ‌న‌సేన సోష‌ల్ మీడియా వేదిక‌గా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. టీడీపీ, బీజేపీల‌తో పాటు త‌మ పార్టీ ఎన్ని సీట్ల‌లో పోటీ చేయ‌నుందో జ‌న‌సేన వెల్ల‌డించింది. 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భ స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు చావు క‌బురు చ‌ల్ల‌గా జ‌న‌సేన చెప్పింది. దీంతో జ‌న సైనికులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. వాళ్ల‌కు నోట మాట రాని ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా వుండే జ‌న సైనికులు నిరాశ‌, నిస్పృహ‌ల‌తో అస్త్ర స‌న్యాసం చేశారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ ఉన్న‌తి కోసం తాము తాప‌త్ర‌య ప‌డ‌డం త‌ప్పితే, ఆయ‌న‌కు మాత్రం ఆ స్పృహే లేద‌నే నిర్ణ‌యానికి జ‌న సైనికులు వ‌చ్చారు. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు త‌లూపే ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోసం తాము తాప‌త్ర‌య ప‌డ‌డంలో అర్థం లేద‌నే జ్ఞానోద‌యం జ‌న‌సైనికుల‌కు ఇప్పుడిప్పుడే క‌లుగుతోంది.

అతి త‌క్కువ సీట్లు తీసుకోవడంపై ఎవ‌రైనా ప్ర‌శ్నించినా, జ‌గ‌న్ కోవ‌ర్టుల‌నే ముద్ర వేస్తార‌ని, ఈ నింద‌లు ప‌డాల్సిన అవ‌స‌రం త‌మ‌కేంట‌నే అభిప్రాయానికి జ‌న సైనికులు వ‌చ్చారు. అందుకే ఇక‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించే ఆలోచించ‌డం మానేసి, త‌మ బ‌తుకేదో చూసుకుందామ‌నే నిర్ణ‌యానికి చాలా మంది జ‌న సైనికులు వ‌చ్చారు.

జ‌న‌సేన రాజ‌కీయ భ‌విష్య‌త్ గురించి ఇక ఆలోచించ‌డం అంటే విలువైన స‌మ‌యాన్ని వృథా చేసుకోవ‌డ‌మే అని జన‌సైనికులు అంటున్నారు. అందుకే ఇంత కాలం ప‌వ‌న్ ఏం చేసినా వ్యూహ‌మ‌నో, ఎత్తుగ‌డ అనో స‌మ‌ర్థించే జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు.. తాజా ప‌రిణామంతో అస్త్ర స‌న్యాసం చేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు.