టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తులో భాగంగా సీట్లపై బిగ్ ట్విస్ట్. ఢిల్లీలో బీజేపీతో పెద్దలతో చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ పలు దఫాలు చర్చల అనంతరం పొత్తు ఖరారైంది. ఆ సందర్భంగా మూడు పార్టీలకు చెందిన నాయకులెవరూ నోరు మెదపలేదు. కేవలం పొత్తు ఖరారైందని మాత్రమే ప్రకటించారు. సీట్లపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
ఎల్లో మీడియా మాత్రం బీజేపీకి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలు ఇచ్చింది. టీడీపీ అధికార మీడియా చెప్పడంతో అందరూ అదే నిజమని నమ్మారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో సంబంధం లేకుండా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లతో బీజేపీ అగ్రనేతలు సీట్లపై చర్చించారు. చివరికి సీట్ల లెక్క తేలింది.
బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. కనీనం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని బీజేపీకి ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వడం ఏంటని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అరశాతం ఓట్లున్న బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ సీట్లు ఇచ్చి, ఆరున్నర శాతం ఓట్లున్న తమకు 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లు ఇవ్వడం ఏంటంటూ జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీకి ఇన్ని సీట్లు ఇచ్చి, చేజేతులా ఓటమిని కొని తెచ్చుకోవడమే అని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
బీజేపీ సీట్లపై వైసీపీ ఎంతో సంతోషంగా వుంది. ఈ మాత్రం సీట్లు చాలు, మరోసారి తాము అధికారంలోకి రావడానికి అంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి ఇచ్చే లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాలను చూపుతూ…ఇంత కంటే ఆ పార్టీ తమకు చేసే మంచి ఏముంటుందని వైసీపీ నేతలు ఆనందంగా ప్రశ్నిస్తున్నారు.