పార్టీ మారిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలకు ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్‌రాజు గట్టి షాక్ ఇచ్చారు. వాళ్లిద్దరిపై అనర్హత వేటు వేశారు. ఇటీవల వైసీపీ, టీడీపీలకు చెందిన చెరో నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్‌లపై ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేశారు.
రామచంద్రయ్య టీడీపీలో, వంశీకృష్ణయాదవ్ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన సందర్భంలో వైసీపీలో వాళ్లిద్దరు తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేసి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవులతో అధికారం దర్పం చెలాయిస్తున్నారు.
ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు వేయాలని కోరుతూ మండలి చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు పంపారు. వారి వివరణ తీసుకున్నారు. సమగ్ర విచారణ తర్వాత వాళ్లిద్దరిపై అనర్హత వేటు వేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్సీలు మాజీలయ్యారు.