ఎప్పుడో షేక్స్పియర్ కాలం తరహా ప్రేమకథ.. పేద హీరో, పెద్ద కుటుంబం హీరోయిన్.. టీనేజ్ లో తొలి చూపు ప్రేమ, ఇంట్లో తెలిశాకా.. హీరో సంపాదన పరుడు కాదని నిరాకరించడం.. హీరోయిన్ ను వేరే ఊరికి పంపించేయడం.. అక్కడ నుంచి విరహం, ఒకర్నొకరు కలుసుకునే ప్రయత్నం.. పెరిగిన దూరంతో ఒకరిపై ఒకరికి నమ్మకం తగ్గడం.. కొత్త పరిచయాలు, మరిచిపోలేని పాత ప్రేమ జ్ఞాపకాలు.. చివరకు ఇలాంటి కథలు ఎలా ముగుస్తాయో.. ఎవ్వరికీ చెప్పనక్కర్లేదు!
ఏ నాగరికతలో అయినా ఇలాంటి ప్రేమ కథలతో వచ్చిన కథల, నాటకాల, నవలల, సినిమాల సంఖ్య లెక్కబెట్టలేనంత స్థాయిలో ఉంటుంది. అయితే ఈ యూనివర్సల్ కాన్సెప్ట్ కు తిరుగుండదు. ఇదే కథతో వందల, వేల సినిమాలు వచ్చినా.. ఇంకా మరో సినిమాకు చోటు ఉండనే ఉంటుంది. ఈ ప్రపంచం ఇలాంటి ప్రేమకథల సృజనకు పుష్పకవిమానం లాంటిది. ఎన్ని వచ్చినా ఇంకా చోటు మిగిలే ఉంటుంది. అలా కొంత గ్యాప్ ను ఫిలప్ చేసిన సినిమా 'ది నోట్ బుక్'.
అమెరికన్ నవలా రచయిత నికోలస్ స్పర్క్స్ ఇదే పేరుతో రాసిన నవలకు సినిమా రూపమే 'ది నోట్ బుక్'. ఒక రొటీన్ కథను చెబుతూ దానికి క్యూరియస్ ఎలిమెంట్స్ ను మిళితం చేసి.. ఒక గొప్ప ప్రేమకథ గా తీర్చిదిద్దిన రచయిత ఘనతను, రచనలోని ఆ ఒడుపును అంతే చక్కగా తెరపై చూపించిన దర్శకుడిని ఎంత అభినందించినా తక్కువే. అమెరికన్ సొసైటీలోని ఒక టీనేజ్ లవ్ స్టోరీని అపురూప ప్రేమగాథగా మార్చిన ఘనత ఈ సినిమా మేకర్స్ ది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రొమాంటిక్ కామెడీ ఇది.
ముందుగా నవల విషయానికి వస్తే..ఆ వర్ణనకే ప్రేమలో పడిపోతాం! చాలా గొప్ప వర్డింగ్ తో చదివే వాళ్ల హృదయానికి హత్తుకునేలా సాగుతుంది 'ది నోట్ బుక్'. చెప్పే కథ పెద్దగా ఆసక్తి లేకున్నా.. వర్ణనతో దాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లి, ఈ నవలను బెస్ట్ సెల్లర్ గా నిలపగలిగాడు నికోల్.
ఒక వృద్ధాశ్రమంలో మొదలవుతుంది ఈ ప్రేమకథ. వయసు రీత్యా వివిధ సమస్యలతో బాధపడుతూ ఉండే వ్యక్తులు ఒకరికికరు బాసటగా నిలుచుకునే క్రమంలో.. తన జీవితంలో ఏం జరిగిందో అంతా మరిచిపోయి, అప్పుడప్పుడు మాత్రమే తన వాళ్లు గుర్తుకు వచ్చే స్థితిలో ఉండే ఒక వృద్ధ మహిళ, ఆమెకు ఒక కథను చదివి వినిపించే మరో వృద్ధుడి పాత్రల పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది.
వేరే రచయిత రాసిన కథగా ఆమెకు దాన్ని చదివి వినిపించడం మొదలుపెడతాడు అతను. ఆ కథ ఒక టీనేజ్ లవ్ స్టోరీ. చాలా చాలా రొటీన్ లవ్ స్టోరీ. ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి వేసవి సెలవుల్లో తమకు తెలిసిన వారున్న ఊరికి వస్తుంది. అందమైన ఆ యువతి తన స్నేహితులతో ఎగ్జిబిషన్ కు వెళ్లగా, అక్కడో నునుగు మీసాల యువకుడు ఆమెను చూసి ప్రేమలో పడిపోతాడు. లవ్ అట్ ఫస్ట్ సైట్. ఆమెను తనతో డ్యాన్స్ కు రమ్మంటూ పిలుస్తాడు ఆ రోమియో. ఆమె నిరాకరిస్తుంది. ఎటు తిరిగీ ఆమె అటెన్షన్ ను గ్రాబ్ చేయడానికి రకరకాల ఫీట్లు చేస్తాడు.
రెండు మూడు రోజుల అతడి ఫీట్స్ కు ఆ అమ్మాయి పడిపోతుంది. అతడితో డేటింగ్ మొదలుపెడుతుంది. ఈ హీరోయిన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ హీరో ఫ్రెండ్ ఒక అబ్బాయి కూడా లవర్స్. వీరంతా కలిసి తిరుగుతూ ఉంటారు. తన ప్రియురాలిని ఇంటికి తీసుకొచ్చి తండ్రికి పరిచయం చేస్తాడు హీరో. తల్లి లేని ఇతడకి తండ్రి ఆమోదం లభిస్తుంది. వీళ్ల ప్రేమ వ్యవహారం హీరోయిన్ తండ్రికి తెలుస్తుంది. అతడు కాస్త ఆమోదించేలానే ఉన్నా, ఆమె తల్లి అడ్డుపడుతుంది. హీరోని ఇంటికి పిలిపించి అవమానిస్తారు. తమ కూతురుకు తగిన వాడివి కాదు పొమ్మంటారు.
ఒక రాత్రి వేళ హీరో ఇంటికి వస్తుంది హీరోయిన్. ఇద్దరూ కలిసి ఒక పాడుబడిన బంగ్లాలో రొమాన్స్ చేసుకుంటారు. కూతురు హద్దు దాటుతోందని గ్రహించి ఆమెను న్యూయార్క్ వెళ్లిపొమ్మంటారు తల్లిదండ్రులు. ఆమె మొదట వెళ్లనంటుంది. కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో తప్పించుకోలేకపోతుంది. తనతో పాటు న్యూయార్క్ రమ్మని హీరోని పిలుస్తుంది హీరోయిన్, అక్కడకు వెళ్లి తను ఏం చేయాలని ప్రశ్నించి.. ఆమెను వెళ్లిపొమ్మంటాడు.
ఒకరితో ఒకరు వాదులాడుకుంటారు, ఆమె వెళ్లిపోతుంది. వెళ్లినప్పటి నుంచి హీరోని ఆమె ఊసులు వెంటాడతాయి. లెటర్స్ రాస్తాడు. అవి హీరోయిన్ కి అందకుండా తల్లి దాచేస్తూ ఉంటుంది. ఇంతలో అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సి వస్తుంది. హీరో, అతడి స్నేహితుడు సైన్యంలో చేరతారు. యుద్ధంలో ఫ్రెండ్ చనిపోతాడు.
యుద్ధంలో గాయపడిన ఖైదీలకు ఒక చోట నర్సుగా సేవలందిస్తూ ఉంటుంది హీరోయిన్. అక్కడ ఆమెకు యుద్ధంలో గాయపడిన మరో యువకుడు పరిచయం , అతడు కోలుకున్నాకా.. ఆమెను డేట్ కు పిలుస్తాడు. అతడి ప్రేమలో పడిపోతుంది హీరోయిన్. ధనిక కుటుంబం కావడంతో అతడితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటారు.
యుద్ధం ముగిసిన తర్వాత సొంతూరికి వచ్చిన హీరో.. పాడుబడిన బంగ్లాను కొంటాడు, దాన్ని సొంతంగా అద్భుతంగా తీర్చిదిద్దుతాడు. దాన్ని కొంటామంటూ అనేక మంది ముందుకు వస్తారు. అప్పటికీ హీరోయిన్ ని మరిచి పోని హీరో.. కాస్త పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ ఇంటిని తీర్చిదిద్దిన అతడి ఘనత గురించి పేపర్లో ఫొటో పడుతుంది. తన పెళ్లికి ప్రిపేర్ అవుతున్న హీరోయిన్ పేపర్లో ఆ ఫొటో చూసి.. కళ్లు తిరిగి పడిపోతుంది. లేచాకా.. హీరోని వెదుక్కొంటూ ఆ ఊరు వస్తుంది.
అతడిని కలిసి అభినందిస్తుంది. ఇక తిరిగి వెళ్లిపోతూ.. ఎందుకు లెటర్స్ రాయలేదంటూ ఏడుస్తూ ప్రశ్నిస్తుంది. తను ఏడాది పాటు ప్రతి రోజూ లెటర్స్ రాసిన విషయాన్ని హీరో చెప్పగానే ఆమె కరిగి పోతుంది. ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడిపోతారు. హీరోయిన్ ను వెదుక్కొంటూ ఆమె తల్లి వస్తుంది. వెనక్కు వెళ్లిపోదామని పిలుస్తుంది. హీరోయిన్ వినదు. చేసేది లేక హీరో రాసిన లెటర్స్ అన్నింటినీ గిఫ్ట్ ప్యాక్ లో ఇచ్చేసి వెళ్లిపోతుంది. హీరోహీరోయిన్లు తనవితీరా శృంగారస్వాదన చేస్తారు.
అయితే హీరోయిన్ కు ఇంకా ఎక్కడో గిల్టీ ఫీలింగ్. అప్పటికే తను ఎంగేజ్డ్. ఈమెను వెదుక్కొంటూ కాబోయే భర్త కూడా ఆ ఊరికి వస్తాడు. అతడు ఎక్కడున్నాడో తెలుసుకుని వెళ్లి సమాధానం చెప్పాలనుకుంటుంది. తనను విడిచి వెళ్లిపోవద్దని హీరో ఒత్తిడి చేస్తాడు. తను వెళ్లాల్సిందే అంటూ ఆమె అతడిని మళ్లీ విడిచి పోతుంది. హీరో అసహనంతో రగిలిపోతాడు. ఆమెను మళ్లీ రావొద్దంటాడు.
వెళ్లి జరిగిదంతా తనకు కాబోయే భర్తకు చెబుతుందామె. అతడు 'నువ్వు నాకు కావాలి.. అందు కోసం నీ ప్రియుడిని చంపేస్తా'నంటూ బయల్దేరతాడు…అతడు కూడా హీరోయిన్ ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆమె గతంతో తనకు పనిలేదని.. పెళ్లి చేసుకోవాలని కోరతాడు.
ఇదంతా పుస్తకంలోని కథ. మధ్యలో రివీల్ చేసే ట్విస్ట్ ఏమిటంటే. మతిమరుపుతో గతం మరిచిపోయిన ఆ ముసలావిడ మరెవరో కాదు.. పుస్తకంలోని కథలోని హీరోయిన్! ఆమెకు కథ చదివి వినిపించేది ఎవరో కాదు, ఆమె భర్త!
వయసు రీత్యా వచ్చేసమస్యలతో గతాన్ని మరిచిపోయిన తన భార్యకు తమ కథనే అనునిత్యం చదివి వినిపిస్తూ ఉంటాడు అతడు. ఆ కథంతా విన్నాకా.. కాసేపు ఆమెకు వాస్తవం గుర్తుకు వస్తుంది. అతడు తన భర్త అని గుర్తుకు వస్తుంది. పిల్లలు ఎక్కడ అని అడుగుతుంది. అదంతా కాసేపే. మళ్లీ మతిమరుపు. పిల్లలు వచ్చి పలకరించినా గుర్తించదు.
ఏ రోజుకారోజు అందరూ ఆమెకు పరిచయం చేసుకోవాల్సిందే. ఆమెను అమితంగా ప్రేమించే భర్త.. తమ ప్రేమకథను అనునిత్యం స్మరించుకుంటూ, ఆమెకు వివరిస్తూ.. ఆమెను తను ఎంత ప్రేమిస్తున్నదీ చెప్పినా ప్రయోజనం లేదని తెలిసినా, దాన్నే తన దినచర్యగా మార్చుకుని ఉంటాడు.
మరి ఇంతకీ ఆమె భర్త ఎవరు? ఆమె టీనేజ్ ప్రేమికుడేనా లేక, ఆ తర్వాత పరిచయమై, ఆమెను అపరిమితంగా ప్రేమిస్తూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్న వ్యక్తితోనే ఆమెకు పెళ్లి జరిగి ఉంటుందా? అనేది ఆసక్తి ఉన్న వాళ్లు 'ది నోట్ బుక్' సినిమాను చూసి తెలుసుకోవచ్చు!
ఒక రొటీన్ లవ్ స్టోరీకి వృద్ధప్యంలో దంపతుల మధ్యన ఉండే ప్రేమాప్యాయతలను జోడించి, యుక్త వయసు నాటి తమ ప్రేమను అనునిత్యం స్మరించుకోగల దంపతులను పరిచయం చేస్తూ ఈ ప్రేమకథ.. నవలగా, సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఫేవరెట్ గా నిలుస్తూ ఉంది.
-జీవన్ రెడ్డి.బి