ఒకే సంస్థ నుంచి పెద్దగా గ్యాప్ లేకుండా రెండు వంద కోట్ల సినిమాలు రావడం అంటే స్టార్ పరుగెడుతోంది అనుకోవాలేమో? పీపుల్స్ మీడియా నిర్మించిన రవితేజ ధమాకా సినిమా వంద కోట్ల కలెక్షన్ దిశగా పరుగెడుతోంది. మరో పది రోజుల పాటు థియేటర్లలో సరైన సినిమా లేదు. దాంతో ధమాకా పరుగు ఆగడం లేదు. శ్రీలీల డ్యాన్స్ లు, పల్సర్ బైక్ సాంగ్, థియేటర్లలో జనాలను గెంతులు వేయిస్తున్నాయి. దాంతో మాస్ ఏరియాల్లో సినిమాకు ఫుల్ బోర్డ్ లు కనిపిస్తున్నాయి.
ఇదే సంస్థ నిర్మించిన కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయింది వందకోట్ల క్లబ్ లో చేరింది. ఈ సంస్థకు ఇదే ఫస్ట్ వంద కోట్ల సినిమా. అంతే కాదు. హీరో నిఖిల్ కు కూడా ఇదే ఫస్ట్ వంద కోట్ల సినిమా. ఇప్పుడు రెండో సినిమా ధమాకా కూడా అదే దిశగా వెళ్తోంది. బహుశా ఈ సినిమా హీరో రవితేజ కు కూడా ఇదే తొలి వంద కోట్ల సినిమా.
రవితేజ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు వున్నాయి కానీ వంద కోట్ల సినిమా లేదు. ఆ లోటు ను ధమాకా సినిమా తీర్చేస్తోంది. అంతే కాదు ఈ సినిమా పీపుల్స్ మీడియా నిర్మాతలు విశ్వప్రసాద్..వివేక్ కూచిభొట్లకు లాభాల పంట పండిస్తోంది. కార్తికేయ 2 లో లాభాలు వచ్చినా భాగస్వాములు ఎక్కువ. హీరో, దర్శకుడు, అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, వివేక్ అంతా వాటాదారులే.
కానీ ధమాకాలో కేవలం విశ్వప్రసాద్ కు , వివేక్ కు మాత్రమే భాగస్వామ్యం. అందువల్ల ఇద్దరికి చాలా పెద్ద మొత్తాలే లాభాలుగా వచ్చే అవకాశం వుంది. ఈ సినిమాను నైజాంలో స్వంతంగా విడుదల చేసుకున్నారు. ఆంధ్రలో ఎన్ ఆర్ ఎ పద్దతిన విడుదల చేసారు. అందువల్ల ఈ రెండు చోట్ల కలిపి సుమారు 10 కోట్లకు పైగానే ఓవర్ ఫ్లోస్ వస్తాయని అంచనా.