అధికారంలోకి రావాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన పర్యటనల్లో, కార్యక్రమాల్లో అపశృతులు ఎదురవుతున్నాయి. ఒక విషాదకర ఘటన మరచిపోకముందే మరో విషాద ఘటన జరగడం శోచనీయం. కొందరు చంద్రబాబుది “ఐరన్ లెగ్ ” అంటున్నారు. కొందరు బాబు పర్యటనల్లో జరుగుతున్న విషాదకర ఘటనలు రాష్ట్రానికి అపశకునంలా భావిస్తున్నారు. బాబు అధికారంలోకి రాకముందే ఇలా ఉంటే ఒకవేళ పొరపాటున అధికారంలోకి వస్తే ఇంకెంత నిప్పచ్చరంగా ఉంటుందోనని విమర్శలు చేస్తున్నారు.
మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట చోటు చేసుకుని ఎనిమిదిమంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా గుంటూరు వికాస్ నగర్ లో నిర్వహించిన సభ, చంద్రన్న కానుకల పంపిణీ సభలోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది. ఈ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు విషాద ఘటనలు వెంటవెంటనే జరగడం శోచనీయం. సంక్రాంతి పండగ సమీపిస్తోన్న నేపథ్యంలో చంద్రన్న కానుకల పేరుతో చీరలను పంపిణీ చేయడానికి తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
చంద్రన్న కానుకల పంపిణీ చేస్తోన్న సమయంలో- దీనికోసం వచ్చిన వారంతా ఒక్కసారిగా ముందుకు తోసుకుని వచ్చారు. దీనితో తొక్కిసలాట సంభవించింది. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.ఇదివరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు..సంక్రాంతి పండగ సమయంలో చంద్రన్న కానుక పేరుతో ఓ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. దాన్నే ఇప్పుడు అనధికారికంగా ఏర్పాటు చేశారు. చంద్రన్న సంక్రాంతి కానుకగా దుస్తులను పంపిణి చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. కందుకూరు రోడ్ షోలో ఎనిమిది మంది మరణించిన ఉదంతం ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోకముందే మళ్లీ అలాంటి ఘటన పునరావృతం కావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది.
ఈ ఘటన పట్ల బాధిత మహిళలు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రన్న కానుకల కోసం తాను 30 మంది వృద్ధులను తీసుకొచ్చానని, ఈ రకంగా చేశారని స్థానిక టీడీపీ నాయకురాలొకరు ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్లు విరగ్గొట్టి, తలకాయలు పగలకొట్టి ఇలానా కానుకలు ఇచ్చేది అంటూ నిలదీశారు. చంద్రన్న కానుకలు ఇమ్మని తామేమైన అడిగామా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇంత మంది వస్తారని తెలిసి కూడా చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడం చేతకావట్లేదా? అంటూ వారు ధ్వజమెత్తారు. తొక్కిసలాట తరువాత చీరల పంపిణీని అప్పటికప్పుడే నిలిపివేశారు. సుమారు 30 వేల మందికి కానుకలు ఇవ్వాలని నిర్వాహకులు భావించారు.
ఈ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చంద్రబాబు మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కానుకల పంపిణీ చేపట్టారు. చంద్రన్న కానుకల కోసం జనం ఒక్కసారి తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. పది రోజులుగా టీడీపీ నేతలు ప్రచారం చేయడం వల్లే పెద్ద ఎత్తున మహిళలు వచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. సంక్రాంతికి చంద్రన్న కానుకలు ఇస్తామని టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సభ ముగిసిన తర్వాత కానుకల కోసం మహిళలు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది.
చంద్రబాబు సభల్లో విషాదకర ఘటనలు జరగడం అధికార వైసీపీకి ఆయుధాలుగా మారాయి. ఆ పార్టీ నాయకులు బాబుపై, టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబుపై భగ్గుమన్నారు. గతంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించడానికి ఆయనే కారణమని గుర్తు చేశారు. ఇప్పుడు కందుకూరులో ఎనిమిది మంది చంద్రబాబు వల్లే దుర్మరణం పాలయ్యారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా గుంటూరు చంద్రన్న కానుకల పంపిణీ సభలో ఇప్పటికి మరో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. ఏమిటి ….చంద్రబాబు పరిస్థితి ఇలా అయింది. ఈ దుర్ఘటనలు వైసీపీకి ఎన్నికల ప్రచారంలో బాగా ఉపయోగపడతాయి.