పేరుకే లాయర్.. మిగతాదంతా మాస్

వెండితెర లాయర్లు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఇప్పటికే చాలామంది చేసి చూపించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరబోతున్నాడు. అయితే ఇంకాస్త కొత్తగా, మరింత డిఫరెంట్ గా ఈ లాయర్ ఉండబోతున్నాడు.…

వెండితెర లాయర్లు ఎలా ఉంటారో అందరికీ తెలుసు. ఇప్పటికే చాలామంది చేసి చూపించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రవితేజ కూడా చేరబోతున్నాడు. అయితే ఇంకాస్త కొత్తగా, మరింత డిఫరెంట్ గా ఈ లాయర్ ఉండబోతున్నాడు.

రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా రావణాసుర. ఈ సినిమా నుంచి ఈరోజు గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో క్రూరమైన లాయర్ గా రవితేజను ప్రజెంట్ చేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. దీనికి మరింత బలం చేకూరుస్తూ 'హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్' అనే క్యాప్షన్ కూడా తగిలించాడు.

గ్లింప్స్ లో రవితేజ లుక్, అతడి పాత్ర స్వభావాన్ని వెల్లడిస్తూనే.. సినిమా జానర్ ను కూడా లైట్ గా టచ్ చేశారు. రావణాసుర సినిమా క్రైమ్ థ్రిల్లర్ అనే విషయం గ్లింప్స్ చూస్తే అర్థమౌతుంది. ఓ సీరియల్ కిల్లర్ మహిళల్ని టార్గెట్ చేసినట్టు చూపించారు.

అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత సుశాంత్ చేస్తున్న మరో కీలకపాత్ర ఇదే. ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లున్నారు. అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఓ మంచి పాత్ర ఉందంటున్నాడు దర్శకుడు.

వేసవి కానుకగా ఏప్రిల్ 7న థియేటర్లలోకి వస్తున్నాడు రావణాసుర. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న రవితేజ, రావణాసురతో మరో హిట్ పై కన్నేశాడు.