కొన్ని రోజుల కిందటి సంగతి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథ లాక్ అయింది, పీపుల్ మీడియా బ్యానర్ కూడా రెడీ. చెట్టు కింద ప్లీడర్ అనే టైటిల్ కూడా పెట్టినట్టు వార్తలొచ్చాయి. ఇక సినిమాను అఫీషియల్ గా ప్రకటించడమే ఆలస్యం అనుకున్నారంతా. కానీ ఇప్పుడా సినిమా దాదాపు ఆగిపోయినట్టు కనిపిస్తోంది.
నక్కిన సినిమాను ప్రకటించాల్సిన స్థానంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఓ కొత్త దర్శకుడి సినిమా ఎనౌన్స్ చేశాడు రవితేజ. ఇది జరిగిన కొన్ని రోజులకే నక్కిన-బెజవాడ ప్రసన్నకుమార్ జంటగా వెళ్లి వరుణ్ తేజ్ కు ''చెట్టు కింద ప్లీడర్'' కథ వినిపించారు.
వరుణ్ తేజ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే.. అంతలోనే ఇద్దరూ వెళ్లి విశ్వక్ సేన్ కు మరో కథ వినిపించారు. విశ్వక్ వెంటనే ఓకే చెప్పాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఆ సినిమా రాబోతోంది.
సో.. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రవితేజ-నక్కిన కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో కార్యరూపం దాల్చేలా లేదు. ఈ కాంబోలో సినిమా ఆగిపోయిందనే అంటున్నారు చాలామంది సినీజనాలు.