నారావారి స్పాన్సర్ షిప్ అందరికీ దొరుకునా..?

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నదంతా రాద్ధాంతమేనంటూ తిప్పికొట్టారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరిస్థితులు చక్కబడిన తర్వాత కచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరుతామన్నారు. విద్యార్థుల భవిష్యత్ తో పాటు, వారి ఆరోగ్యంపై…

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నదంతా రాద్ధాంతమేనంటూ తిప్పికొట్టారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరిస్థితులు చక్కబడిన తర్వాత కచ్చితంగా పరీక్షలు నిర్వహించి తీరుతామన్నారు. విద్యార్థుల భవిష్యత్ తో పాటు, వారి ఆరోగ్యంపై కూడా ప్రభుత్వానికి శ్రద్ధ ఉందని స్పష్టం చేశారు. పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం సరికాదన్నారు మంత్రి.

పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అంటే భవిష్యత్ లో విద్యార్థులకే ఇబ్బంది అని, పోటీ పరీక్షల్లో, ఇతర అడ్మిషన్లలో బాగా చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఇక నారావారి స్పాన్సర్ షిప్ వ్యవహారంపై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి సురేష్.

నారా లోకేష్ బాబు లాగా, వారి బాబు చంద్రబాబు లాగా అందరికీ అలాంటి తండ్రులు ఉండరు కదా అని అన్నారు సురేష్. కొడుకు చదువుకి స్పాన్సర్ చేయించుకోడానికి చంద్రబాబుకి సత్యం రామలింగరాజు దొరికారని, ఆయన చలవతోనే లోకేష్ ని విదేశాలకు పంపించారని గుర్తు చేశారు. అసలు విద్యార్థుల పరీక్షల విషయంలో చంద్రబాబు, లోకేష్ ఎందుకు రాజకీయం చేస్తున్నారని నిలదీశారు. ప్రతి రోజూ జూమ్ కాన్ఫరెన్స్ ల పేరుతో విద్యార్థుల మైండ్ చెడగొడుతున్నారని మండిపడ్డారు.

అలాంటి కాలేజీలపై చర్యలు..

పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయంటూ ప్రచారం చేసుకుని, ఇంటర్ అడ్మిషన్లు తీసుకుంటున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి సురేష్. 

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇలా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్ కాలేజీలు అడ్మిషన్లు ఇచ్చి, ఆన్ లైన్ క్లాసులు నడుపుతున్నాయనే విషయాన్ని మీడియా మంత్రి దృష్టికి తీసుకురాగా.. ఆయన స్పందించారు. పరీక్షలు రద్దయ్యాయనే తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలికెందుకు..?

ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు కాబట్టి, ఏపీలో కూడా పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు మంత్రి సురేష్. ఏపీలోని సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడం లేదు కదా అని ఆయన ప్రశ్నించారు. స్థానిక పరిస్థితులను బట్టి పరీక్షల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేశారు.