కలెక్టర్ అంటే ఎక్కడో అంతస్తుల్లో ఉంటూ అదేశాలు మాత్రమే జారీ చేస్తే ఉన్నత అధికారి అన్నది జన సామాన్యంలో ఉన్న మాట. అయితే కలెక్టర్ కూడా ప్రజా సేవకుడే. ఆయనే అసలైన ఫ్రంట్ లైన్ వారియర్ ని ఆచరణాత్మకంగా రుజువు చేశారు జె నివాస్. ఆయన శ్రీకాకుళం వంటి వెనకబడిన జిల్లాకు కలెక్టర్ గా రెండున్నరేళ్ళ క్రితం నియమితులయ్యారు. నాటి నుంచి నేటి వరకూ ఆ జిల్లా అభివృద్ధిలో ఆయన చేసిన కృషి అమోఘం.
ఆయన ప్రజలతో పాటే తానూ అంటూ వారి కష్టంలో నష్టంలో పాలు పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఆయన హయాంలో రెండుసార్లు అతి భయంకరమైన కరోనా శ్రీకాకుళం జిల్లాను కమ్మేస్తే తగిన విధంగా స్పందించి చాలా తక్కువ వ్యవధిలో సాధారణ పరిస్థితులను తీసుకు వచ్చారు.
ఆయన ముందు చూపు సమర్ధత, అందరినీ కలుపుకుని పోయే తత్వానికి మొత్తం శ్రీకాకుళం జిల్లా ఫిదా అయింది. అందుకే ఆయన బదిలీ అయి వెళ్తూంటే జిల్లా మొత్తం కన్నీరు పెడుతోంది. ఇంత మంచి కలెక్టర్ మాకు కాకుండా వెళ్ళిపోతున్నారే అంటూ తెగ బాధపడుతున్నారు.
ఆయన వద్ద పనిచేసిన సిబ్బంది నుంచి జిల్లాలోని అన్ని విభాగాల వరకూ ఆయన బదిలీపైన వెళ్ళిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు జరిగిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ జె నివాస్ అయితే తెగ ఆవేదన చెందారు.
తాను జిల్లాను ప్రేమించిన తీరు ఆయన మాటల్లో కనిపించింది. మొత్తానికి తనకు సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియచేశారు. నిజానికి లోకాన చాలా మంది మంచి అధికారులు ఉంటారు, వారు తమ పనితీరుతో జనాలలో శాశ్వతమైన అభిమానాన్ని పొందుతారు. అలా జె నివాస్ జనం గుండెల్లో గూడు కట్టుకున్నారని సిక్కోలు జిల్లా మొత్తం ఒక్క మాటగా అంటోంది.