హీరోయిన్ కనిపిస్తే ఎఫైర్ గురించి అడుగుతారు లేదంటే పెళ్లి గురించి ఆరా తీస్తారు. రెజీనా కనిపించినా ఒకప్పుడు ఇవే ప్రశ్నలు అడిగేవారు. కానీ ఇప్పుడు ఓ కొత్త ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. “పెద్ద హీరోల సరసన ఎందుకు ఛాన్స్ రావడం లేదు” అనేది ఆ ప్రశ్న.
దీనికి సమాధానం తనకు కూడా తెలియదంటోంది రెజీనా. కేవలం మీడియా మాత్రమే కాదని, తన ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో స్నేహితులు, అప్పుడప్పుడు కుటుంబ సభ్యులు కూడా ఇదే ప్రశ్న అడుగుతుంటారని స్పష్టంచేసిన రెజీనా.. తనకు ఎందుకు పెద్ద హీరోల సరసన ఆఫర్లు రావడం లేదో తనకు కూడా తెలియదంటోంది.
ఒకప్పుడు పెద్ద హీరోల సరసన ఆఫర్లు రానందుకు చాలా బాధపడేదాన్నంటున్న రెజీనా.. ఇప్పుడు మాత్రం ఓటీటీ రాకతో తనకు ఆ బాధ లేదంటోంది. మరీ ముఖ్యంగా సినిమాల్లో కూడా డిఫరెంట్ పాత్రలు పోషించే అవకాశం వస్తుండడంతో.. ఇక తను బడా హీరోల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా స్పందించింది.
అయినా చాలామంది హీరోయిన్లకు బిగ్ స్టార్స్ సరసన ఛాన్సులు రావడం లేదని, అలాంటప్పుడు తననే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అంటోంది రెజీనా. ఈమె నటించిన చక్ర సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది.
ఈ సినిమాలో లీల అనే విలన్ పాత్రలో నటించింది రెజీనా. ఆ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని చెబుతోంది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మరోవైపు చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో ఐటెంసాంగ్ చేసింది రెజీనా.