హీరో కంటే ముందు లాక్ అయిన రేణు దేశాయ్

సాధారణంగా ఓ సినిమా అనుకున్నప్పుడు, ముందుగా హీరోను సంప్రదిస్తారు. హీరో ఓకే చెప్పిన తర్వాత, మిగతా నటీనటుల ఎంపిక ప్రారంభమౌతుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో ఇలా జరగలేదు. ఇదో గమ్మత్తైన విషయం.…

సాధారణంగా ఓ సినిమా అనుకున్నప్పుడు, ముందుగా హీరోను సంప్రదిస్తారు. హీరో ఓకే చెప్పిన తర్వాత, మిగతా నటీనటుల ఎంపిక ప్రారంభమౌతుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో ఇలా జరగలేదు. ఇదో గమ్మత్తైన విషయం.

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరో రవితేజ. అయితే ఈ ప్రాజెక్టుకు ఆయన ఓకే చెప్పడానికంటే ముందే రేణు దేశాయ్ ఇందులోకి వచ్చి చేరింది. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.

నిజానికి టైగర్ నాగేశ్వరరావు సినిమాను మరో హీరోతో ప్లాన్ చేశాడట దర్శకుడు వంశీ. నెరేషన్ కూడా అయిపోయింది. అదే టైమ్ లో హేమలత లవణం పాత్రను రేణుదేశాయ్ కు చెప్పడం ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి.

అయితే ఈ గ్యాప్ లో ముందు అనుకున్న హీరో డ్రాప్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ వచ్చాయి. ఆ తర్వాత రవితేజకు ఈ కథ వినిపించి ఓకే చేసుకున్నారు. అప్పటికే రేణు దేశాయ్ తో అగ్రిమెంట్ కూడా పూర్తయింది.

అలా టైగర్ నాగేశ్వరరావు ప్రాజెక్టులోకి అందరికంటే ముందు తాను వచ్చినట్టు వెల్లడించింది రేణు దేశాయ్. ఈ సినిమాకు ఆమె 2019లోనే సైన్ చేసిందంట. ఆ తర్వాత రవితేజతో పాటు మిగతా వాళ్లంతా వచ్చారట.

అన్నట్టు ఈ సినిమాలో హేమలతా లవణం పాత్ర కోసం మొదట్నుంచి రేణు దేశాయ్ నే అనుకున్నారట. ఆమె గొప్పదనం తెలుసుకున్న తర్వాత, ఆ పాత్ర పోషించడం తన అదృష్టంగా భావించిందంట రేణు. సినిమాలో ఆమె పాత్రలో ఒక్క నిమిషం కనిపించినా చాలని డైరక్టర్ కు చెప్పిందట.

దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది టైగర్ నాగేశ్వరరావు సినిమా. రేణు దేశాయ్ కు ఇది రీఎంట్రీ మూవీ. పవన్ కల్యాణ్ తో చేసిన జానీ సినిమా తర్వాత మళ్లీ ఆమె ఫుల్ లెంగ్త్ రోల్ చేయలేదు.