గాడిద‌ల్లా త‌యార‌వుతున్నాం-సీనియ‌ర్ న‌టి

సామాజిక స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంలో సీనియ‌ర్ న‌టి రేణు దేశాయ్ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆమె రియాక్ష‌న్‌లో క‌ప‌టం, లౌక్యానికి చోటు లేదు. తాను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని సూటిగా, స్ప‌ష్టంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంలో రేణు…

సామాజిక స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డంలో సీనియ‌ర్ న‌టి రేణు దేశాయ్ ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఆమె రియాక్ష‌న్‌లో క‌ప‌టం, లౌక్యానికి చోటు లేదు. తాను చెప్ప‌ద‌లుచుకున్న విష‌యాన్ని సూటిగా, స్ప‌ష్టంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డంలో రేణు దేశాయ్‌కి ఆమే సాటి. క‌రోనాతో లోకం విల‌విల‌లాడుతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స్పంద‌న ఆక‌ట్టుకుంటోంది.

ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా రేణు దేశాయ్ ఓ పోస్ట్ చేశారు. అందులో ఏమున్న‌దంటే…

'బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కేవలం బాధ పడటానికి ఈ శరీరం లేదు కదా? బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కొని ఆనందంగా ఉండాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం అని భావోద్వేగంతో కూడిన అభిప్రాయాల‌ను పంచుకున్నారు. ఇంత‌టితో ఆమె ఆగ‌లేదు.

'ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో సంతోషంగా ఉండటానికి ఏది అవసరమో అది చేయండి. స్టాండప్‌ కామెడీ వీడియోలు కానీ, క్యూట్‌ పప్పీ (కుక్కపిల్ల)ల వీడియోలు చూడండి. ఈ కష్టకాలం కూడా ఎక్కువ రోజులు ఉండదు. అది వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పదనం. అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటించండి. సురక్షితంగా ఉండండి' అంటూ మానసిక‌ ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు.  

రేణు దేశాయ్ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. క‌ష్ట‌కాలం కూడా ఎక్కువ రోజులు ఉండ‌ద‌ని, అదే కాలానికి ఉన్న గొప్ప‌ద‌నమ‌ని చెప్ప‌డం ద్వారా త‌న స్వీయ అనుభ‌వాల‌ను రంగ‌రించి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్ర‌జానీకంలో నింపే ప్ర‌య‌త్నం చేసిన రేణు దేశాయ్ సామాజిక దృక్ప‌థం ప్ర‌శంస‌నీయ‌మ‌నే పొగ‌డ్త‌ల వ‌ర్షం కురుస్తోంది. శ‌భాష్ రేణు.